మమ్మల్ని పట్టించుకోండి | Pattincukondi Us | Sakshi
Sakshi News home page

మమ్మల్ని పట్టించుకోండి

Published Thu, Mar 12 2015 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

Pattincukondi Us

‘భూములు, ఇళ్లు, ఆస్తులు అన్నీ అప్పగించినం. కానీ, ఉపాధి సమయంలో మమ్మల్ని విస్మరిస్తున్నరు. సింగరేణిలో, ఎన్టీపీసీలో ఇలాగే చేశారు. ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు మేం వ్యతిరేకం కాదు. కానీ, మాకు ఉపాధి కల్పించండి... మా గ్రామాల్లో వసతులు కల్పించండి’ అని ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు తేల్చిచెప్పారు. బుధవారం జేసీ పౌసుమి బసు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కొన్ని నిరసనలు, పోలీసు బందోబస్తు మధ్య సాఫీగానే సాగింది.    - గోదావరిఖని
 
గోదావరిఖని : ‘ప్రాజెక్టు కోసం భూములు, ఆస్తులు ఇస్తే తర్వాత విస్మరిస్తున్నారు... కర్మాగారం ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు.. ఉపాధి, ఉద్యోగావకాశాలు స్థానికులకే కల్పించండి’ అంటూ ఎఫ్‌సీఐ ప్రభావిత గ్రామాల ప్రజలు అభిప్రాయపడ్డారు. రామగుండం ఎరువుల కర్మాగారం(ఎఫ్‌సీఐ) పునరుద్ధరణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు అధ్యక్షతన ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు, కాంట్రాక్టు కార్మికులు పలు దఫాలు నిరసన తెలపగా, చివరకు పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమం సజావుగా ముగిసింది. గ్యాస్ ఆధారితంగా నూతనంగా ‘రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)’ పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే.

కర్మాగారం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గతంలో పర్యావరణపరంగా చర్యలు సరిగ్గా తీసుకోకపోవడంతో దిగువ ప్రాంతం ల క్ష్మీపురంలోని బావులు, చెరువులలో బూడిద చేరి నీరు కలుషితమైందన్నారు. ప్రస్తుతం అలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీపీసీ, సింగరేణికి గతంలో భూములు అప్పగిస్తే ఇప్పుడు ఉద్యోగాలు లేవంటున్నారని ఎఫ్‌సీఐ అలా చేయొద్దని కోరారు. ఎఫ్‌సీఐ కర్మాగారం గోడకు ఆనుకుని ఉన్న వీర్లపల్లిలో తాగునీటి  ఇబ్బందులు ఉన్నాయని, ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగతో అనారోగ్యంపాలవుతున్నామని గ్రామస్తులు ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. గ్రామాన్ని తీసుకుని వేరేచోట పునరావాసం కల్పించాలని కోరారు. గతంలో ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికుల వారసులకు అర్హతలను బట్టి ఉద్యోగావకాశాలు కల్పించాలని కాంట్రాక్టు కార్మికులు నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ 10 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉన్న ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లోని రహదారిని మూసివేయొద్దని, అవసరమైతే ఆర్‌ఎఫ్‌సీఎల్ యూజమాన్యం గేట్ నిర్మించుకోవాలని సూచించారు. స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, మాజీ కార్మికులకు వైద్య సౌకర్యాలు, వారి పిల్లలలో పనిచేసే వీలున్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.  అనంతరం జేసీ పౌసుమి బసు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవిదాస్ మాట్లాడుతూ ఆర్‌ఎఫ్‌సీఎల్ కర్మాగారంపై ప్రజలు అభిప్రాయూలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపించనున్నట్లు ప్రకటించారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్ సీఈవో వివేక్ మల్హోత్రా, ఎఫ్‌సీఐ ఇన్‌చార్జి జీఎం సీత, మల్లేశ్వరి, రాజ్‌కుమార్, పెద్దపల్లి ఆర్డీవో నారాయణరెడ్డి, తహశీల్దార్ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ ఆడెపు రాజేశం, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం, మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బాబర్ సలీంపాషా, వీఎస్‌ఎస్ సంఘం ప్రధాన కార్యదర్శి జీఎన్ రావు, ఎం.సుందర్‌రాజు, కంది శ్రీనివాస్, బొర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement