మెరుగువాడలు
- పేదలవాడల్లో మార్పునకు శ్రీకారం చుట్టనున్న జీహెచ్‌ఎంసీ
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యం
- సీఎం ఆదేశాలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు
- పెలైట్ ప్రాజెక్టుకు కసరత్తు
- రూ. 624 కోట్లతో అంచనా
మురికివాడల రహితంగా గ్రేటర్ హైదరాబాద్ రూపుదిద్దుకోనుంది. డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణం.. మౌలిక వసతులు మెరుగుపర్చడం ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గానికో మురికివాడను పెలైట్ ప్రాజెక్టు కిందకు తీసుకురానున్నారు. పెలైట్ ప్రాజెక్టు అమలుకు రూ. 624 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల హామీల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌ను మురికివాడల రహిత నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదల వాడల్లో పక్కా ఇళ్లు నిర్మించడంతో పాటు మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో వివిధ పథకాల కింద పక్కా ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటన్నింటినీ పక్కనబెట్టి స్లమ్ ఫ్రీ సిటీగా మార్పు చేసేందకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు అధికారులు పనులు వేగవంతం చేశారు. పెలైట్ ప్రాజెక్టు కింద ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో మురికివాడను ఎంపిక చేసే పనిలో పడ్డారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో పాటు మౌళిక వసతులు కల్పించనున్నారు. తాజా గణాంకాల మేరకు గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో 1476 స్లమ్స్ ఉన్నాయి. వీటిని మూడు రకాలుగా (1. ఇన్‌సిటు రీ డెవలప్‌మెంట్ 2. ఇన్‌సిటు అప్‌గ్రేడేషన్ 3. రీ లొకేషన్‌లుగా) విభజించారు.
తొలి దశలో రీ లొకేషన్ మినహాయించి మిగతా రెండు విధానాలను నియోజకవర్గానికి ఒక్కో స్లమ్‌ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోనున్నారు. ఇందుకుగాను దాదాపుగా రూ. 648.24 కోట్లు ఖర్చవుతుందని ప్రా థమికంగా అంచనా వేశారు. ప్రభుత్వ ఆమోదంతో దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. గతంలో చేపట్టిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, రాజీవ్ ఆవాస్‌యోజన(రే) పథకాల్లో ఒక్కో ఇంటికి వ్యయ పరిమితి ఉండగా.. స్లమ్ ఫ్రీ లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి పరిమితి పేర్కొనలేదు.
రెండు బెడ్‌రూమ్‌ల ఇంటి నిర్మాణానికి దాదాపు రూ. 6.55 లక్షలు అవుతుందని అంచనా. రే పథకం ద్వారా ఇళ్లకు రూ. 5 లక్షల వరకు కేంద్రం మంజూరు చేస్తుంది. అదనపు వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం భరించినా ఆ మేరకు కేంద్రం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసే స్లమ్స్‌లో ఎదురయ్యే సాదకబాధకాలను పరిగణనలోకి తీసుకొని.. తదుపరి చర్యలు తీసుకోనున్నారు. పెలైట్ ప్రాజెక్టులో పొందుపర్చిన అంశాలు ఇలా ఉన్నాయి.
నగరంలో ఏ గృహనిర్మాణ పథకం చేపట్టినా పలు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. స్లమ్ ఫ్రీ సిటీలోనూ కాలనీల స్వరూపం మారే అవకాశం ఉన్నా ప్రజల నుంచి సహకారం ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. స్లమ్స్‌లో తక్కువ విస్తీర్ణంలో ఇళ్లున్నవారు... ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లున్న వారు ఉన్నారు.
కొత్త గృహాల్లో అందరికీ ఒకే విధంగా కేటాయించనుండడంతో ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు ఉన్నవారు ఒప్పుకునే అవకాశాల్లేవు. రే పథకంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అందరికీ ఇండి పెండెంట్ ఇళ్లు ఇవ్వడం న గరంలో సాధ్యమయ్యేలా లేదు. అంతస్తుల్లో ఫ్లాట్‌లంటే ఒప్పుకునేందుకు ముందుకొచ్చేదీ అనుమానమే. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తాయో వేచి చూడాలి.
ప్రతిపాదించిన మూడు విధానాలు
1. ఇన్‌సిటు రీ డెవలప్‌మెంట్: స్లమ్‌లోని ఇళ్లన్నింటినీ కూల్చివేసి కొత్తగా నిర్మించడం. అందరికీ సరిపడినన్ని ఇళ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించడం.
2. ఇన్‌సిటు అప్‌గ్రెడేషన్: ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేయకుండా.. ఉన్న ఇళ్లకే అదనపు నిర్మాణాలు చేసి అభివృద్ధి పరచడం. మౌలిక సదుపాయాలు కల్పించడం.
3.రీ లొకేషన్: సమీపంలో ప్రమాదకర పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇతర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడం. వారిని వేరే ప్రాంతానికి తరలించడం ద్వారా ఉపాధి కోల్పోయే వారి జీవనోపాధి కల్పించడం.
పైలట్ స్లమ్స్ ఎంపిక...
నియోజకవర్గానికి ఒక స్లమ్ చొప్పున ఇన్‌సిటు రీ డెవలప్‌మెంట్ అంచనా వ్యయం రూ. 18.01 కోట్లు.
24 నియోజకవర్గాలకు వెరసి 24 స్లమ్స్ రీ డెవలప్‌మెంట్‌కు 18.01్ఠ24 = రూ. 432.24 కోట్లు.
నియోజకవర్గానికి ఒక స్లమ్ చొప్పున ఇన్‌సిటు అప్‌గ్రెడేషన్ అంచనా వ్య యం ఒక్కో స్లమ్‌కు రూ. 9.00 కోట్లు.
24 నియోజకవర్గాలకు వెరసి మొత్తం రూ. 9.00్ఠ24= రూ. 216.00 కోట్లు.
రెండు కేటగిరీలకు వెరసి మొత్తం అంచనా వ్యయం రూ. 648.24 కోట్లు