జిల్లాలో ముగ్గురు వృద్ధులు మృతి
జడ్చర్ల, పాన్‌గల్, నారాయణపేట రూరల్ : పింఛన్‌పై ఆదారపడి జీవించే వృద్ధులు ‘ఆసరా’ కోల్పోయామని రోజుకొకరు ప్రాణాలు వదులుతున్నారు. ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా అధికారులు పింఛన్ జాబితాలో పేర్లు తొలగించేశారు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పింఛన్ వస్తుందో రాదోనన్న బెంగతో వారు మంచం పట్టి మరణిస్తున్నారు. ఈ సంఘటనలు జిల్లాలో నిత్యకృత్యమవ్వగా ఆదివారం మరో ముగ్గురు మృతిచెందారు.
జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన నాయినిపల్లి కృష్ణయ్య(62) అనే వృద్ధుడు తన పేరు పింఛన్ జాబితాలో లేదని తెలుసుకుని వారం రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడి లోనై శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న దగ్గరే మృతి చెందాడు. కృష్ణయ్యకు రెండేళ్ల కిందట పక్షవాతం రావడంతో అప్పటినుంచి మందులకోం పింఛన్‌పై ఆధారపడేవాడు. తీరా పింఛన్ రద్దు కావడంతో బెంగతో మృతిచెందాడు. ఈ విషయంపై తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి విచారణ చేపట్టారు.
పాన్‌గల్ మండలం జమ్మాపూర్ గ్రామానికి చెందిన కుర్వ రామచంద్రయ్య (80) కూడా పింఛన్ రాలేదని చనిపోయాడు. తన పేరు రద్దయిన తర్వాత ఇటీవల కొత్త ఫించన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తుది జాబితాలోకూడా తన పేరు లేదని రెండ్రోజులుగా మనస్తాపానికి గురయ్యాడని, చివరికి ఆదివారం అదే దిగులుతో మరణించాడని మృతుని కుమారులు నాగయ్య, కృష్ణయ్య, మల్లయ్య రోదిస్తూ వాపోయారు. బాధిత కుటుంబాన్ని సర్పంచు భాస్కర్‌రెడ్డి, అధికారులు పరామర్శించారు.
నారాయణపేట పట్టణంలోని 23వ వార్డుకు చెందిన కొనంగేరి సీతమ్మ (71) కూడా పింఛన్ రావడంలేదనే దిగులుతో ప్రాణాలు వదిలింది. ఆమెకు ఇదివరకే * 200 పింఛన్ వచ్చేది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఆసరా పథకం జాబితాలో పేరు రాకపోవడంతో బెంగపడి ఆదివారం ఉదయం చనిపోయింది. పింఛన్ వచ్చి ఉంటే వృద్ధురాలు బతికుండేదని తోటి వృద్ధులు వాపోయారు.
పింఛన్ రాక ప్రాణం పాయె!
Published Mon, Dec 8 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM
Advertisement