
సాక్షి,సిటీబ్యూరో: నిరుపేద ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు శుభవార్త. ప్రస్తుతం అందిస్తున్న పింఛన్ల సొమ్ము రెట్టింపు కానుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 4.80 లక్షల మంది పేదలకు లబ్ధిచేకూరనుంది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన పింఛన్లు జూన్ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. జులై నెలలో లబ్ధిదారుల చేతికి అందనున్నాయి. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వీ–ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులకు పెరిగిన పింఛన్ల ప్రకారం నెలకు రూ. 2016 అందనున్నాయి. దివ్యాంగులకు రూ. 3016 అందనున్నాయి. ఎన్నికల సమయంలో తిరిగి అధికారం లోకి వస్తే పింఛన్ సొమ్ము రెట్టింపు చేస్తామని టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హామీ మేరకు ప్రభుత్వం పింఛన్ల పెంపు హామీని అమల్లోకి తీసుకువచ్చింది.
పింఛనుదారులు ఇలా...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 4,80,275 పెన్షన్‌దారులు ఉండగా అందులో వృద్ధాప్య పెన్షన్‌దారులు 1,50,401 మంది, దివ్యాంగులు పింఛన్‌దారులు 73,028 మంది, వింతంతు పెన్షన్‌దారులు 2,25,504 మంది, చేనేత కార్మిక పింఛనదారులు 909 మంది, గీత కార్మికులు 2469 మంది, హెచ్‌ఐవీ పింఛనుదారులు 8389 మంది, ఫైలేరియా పింఛనుదారులు 157 మంది, బీడీ కార్మిక పింఛనుదారులు 229 మంది, ఒంటరి మహిళా పెన్షన్ లబ్ధిదారులు 19,189 మంది ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తమ్మీద రెవెన్యూ జిల్లావారిగా పరిశీలిస్తే హైదరాబాద్ జిల్లాలో 1,96,806, రంగారెడ్డి జిల్లాలో1,73,674 మేడ్చల్ జిల్లాలో 1,09,795 మంది పెన్షన్‌లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది.
నెలకు రూ.104.12 కోట్లు
మహా నగరంలో అసరా పించనుదారులుకు ప్రతి నెలా రూ. 104.12 కోట్లను ప్రభుత్వం అందించనుంది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వీ–ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులైన మొత్తం 4,07,247 మంది అసరా లబ్ధిదారులకు నెలకు రూ. 2016 చొప్పున రూ.82,10,09,952లు, దివ్యాంగులైన 73,028 మంది లబ్ధిదారులకు∙ రూ.3016 చొప్పు న నెలకు 22, 02, 52,448లు అందించనుంది.
మేడ్చల్ జిల్లాలో 1.10 లక్షల పింఛన్లు
సాక్షి,మేడ్చల్ జిల్లా : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పింఛన్లు మొత్తం 1,10,355 ఉన్నాయి. వీరికి ప్రతి నెలా రూ.12.57 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే..పెరిగిన పింఛన్లతో జిల్లాపై అదనంగా రూ.20.74 కోట్ల భారం పడుతోంది. జిల్లాలో 1,10,355 పింఛన్లు ఉండగా ఇందులో దివ్యాంగుల పింఛన్లు 20,189, వృద్ధాప్య పింఛన్లు 32,025, వితంతు 52,306, చేనేత కార్మికులు 152, గీత కార్మికులు 427, బీడీ కార్మికులు 164, ఒంటరి మహిళలు 5,092 మంది ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా రూ.12.57,29,500 పంపిణీ చేస్తున్నారు. పెరిగిన పింఛన్‌తో జూన్ నుంచి ప్రభుత్వం రూ.33,31,30,680 చెల్లించాలి. జిల్లాలోని 20,189 మంది దివ్యాంగులకు నెలకు రూ.3016 చొప్పున మొత్తంగా రూ. 6,11,90.024 చెల్లించాల్సి వస్తున్నది. మిగతా 90,166 మంది పింఛన్ దారులకు నెలకు రూ.2016 చొప్పున రూ.27,19,40,656 పంపిణీ చేయాల్సి ఉంది. దీంతో జిల్లా పై పింఛన్ల అదనపు భారం ప్రతి నెల రూ.20.74 కోట్లు పడుతున్నది.
Comments
Please login to add a commentAdd a comment