కేసీఆర్‌ను విమర్శిస్తే జనం సహించరు
సంగారెడ్డి క్రైం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తే జనం సహించబోరని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తూప్రాన్‌లో శనివారం జరిగిన టీడీపీ జిల్లా సమావేశంలో ఆ పార్టీ నేతలు కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం వారి దివాలా కోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. టీడీపీ నడి సముద్రంలో మునిగిపోతున్న నావ లాంటిదన్నారు. అందులో కూర్చొని ఆ పార్టీ నాయకులు మతి భ్రమించిన వారిలా కేసీఆర్‌పై విమర్శలకు దిగుతున్నారన్నారు. కేసీఆర్ మాటల మనిషి కాదని, చేతల మనిషన్న విషయం గత 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో, 8 నెలల ప్రభుత్వ పాలనలో రుజువైందన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి యావత్ రాష్ట్రమేగాక దేశం సైతం అబ్బురపడుతోదన్నారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ లాంటి చరిత్రాత్మక పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. జిల్లాలో నాలుగున్నర లక్షలకుపైగా సభ్యత్వ నమోదు కావడం ఇందుకు నిదర్శనమన్నారు. టీడీపీ నేతలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవంత్‌రెడ్డిలకు మతిభ్రమించి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ పరాయి రాష్ట్ర పాలకులకు వంత పాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ర్ట సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్, హరీష్‌రావును విమర్శిస్తే జనం టీడీపీ నేతలను క్షమించరన్నారు.