
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా లేక.. ఆరోగ్యం క్షీణించి ఆఖరుకు నడి రోడ్డుపైనే ప్రాణాలు విడిచిన హృదయ విదారక సంఘటన భాగ్యనగరం నడిబొడ్డున జరిగింది. బహదూర్ (75) అనే మద్యం దుకాణం ఉద్యోగి ఇదే రీతిలో మృత్యువాత పడిన సంఘటన మరువక ముందే ఈ ఉదంతం చోటుచేసుకోవడం నగరవాసులను కలవరపరుస్తోంది. బీదర్‌లోని బాల్కీ గ్రామానికి చెందిన గోవిందు (45) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య పూజ, ఇద్దరు కుమార్తెలు, నెలన్నర వయసున్న కుమారుడు ఉన్నారు. బోడుప్పల్ పరిధి రాజశేఖర్ కాలనీలో నివాసముంటున్న గోవింద్.. ఏప్రిల్ రెండో వారంలో అనారోగ్యానికి గురయ్యాడు.
తీవ్రమైన దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడుతుండటంతో ఇరుగు పొరుగు వారు గమనించి మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అతడిని ఏప్రిల్ 24న 108 సాయంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. కరోనా పరీక్షలు అవసరం లేదని, చెస్ట్ ఆస్పత్రికి వెళ్లాలని సిఫారసు లేఖ రాసి పంపారు. అక్కడికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా దొరకలేదు. దీంతో చెస్ట్ ఆస్పత్రికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బొగ్గులకుంట చౌరస్తాలో గురువారం రాత్రి గోవిందు రోడ్డుపై పడిపోయాడు. గమనించిన ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు గోవిందును పరీక్షించగా, మృతి చెందినట్లు గుర్తించారు. గోవిందు వద్ద ఉన్న కాగితాలను పరిశీలించి, బంధువులకు సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. చదవండి: 17దాకా లాక్‌డౌన్.. సడలింపులివే..!
పప్పా వెళ్లిపోతున్నాడు..
విగతజీవిగా పడి ఉన్న గోవిందును చూసి భార్య పూజ కన్నీరు మున్నీరయ్యింది. గోవిందు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా, ‘పప్పా..వెళ్లిపోతున్నాడు’అంటూ పిల్లలు రోదించడం అక్కడున్న వారిని కంటతడిపెట్టించింది. కాగా, తాను గత వారం రోజులుగా మేడిపల్లి పోలీసులకు ఫోన్ చేస్తూనే ఉన్నానని.. వారు తన భర్తకు కింగ్‌కోఠిలో చికిత్స అందిస్తున్నారనే చెప్పారని.. గురువారం ఉదయం కూడా వారి నుంచి అదే సమాధానం వచ్చిందని పూజ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment