సాక్షి, హైదరాబాద్: దేశం, రాష్ట్రం అనీ తేడా లేకుండా కరోనా మహమ్మారి విస్తృతి పెరుగుతుండటంతో, దాన్ని నుంచి తప్పించుకునేందుకు ప్రజా రవాణా వాహనాలను పక్కనపెట్టి.. సొంత వాహనాలను వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వ్యక్తిగత ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ సొంత కార్లు, బైక్‌ల్లో ప్రయాణించేందుకు జనాలు మొగ్గుచూపుతున్నారు. వ్యక్తిగత వాహనాలు లేని వారు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఉన్నా సొంతంగా సెకండ్ హ్యాండ్ వాహనాన్నైనా సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జాతీయ సర్వేలు చెబుతున్నాయి.
భౌతిక‘దూరం’పాటించేందుకు..
లాక్‌డౌన్‌కు ముందు ప్రభుత్వ, ప్రైవేటు రంగా ల్లో పనిచేసే వారితో పాటు, దూర ప్రయాణాలు చేసే వారు మెట్రో రైళ్లు, బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు వంటి ప్రజా రవాణానే వినియోగించేవారు. సొంత వాహనాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి ప్రజా రవాణా ద్వారానే ప్రయాణం సాగించే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో రైలు సర్వీసులు లేకపోవడం, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడపకపోవడంతో వ్యక్తిగత వాహనాలే ఎక్కువగా రోడ్డెక్కుతున్నాయి. ఆటోలు, క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్నా, కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కారణంగా వాటిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య తగ్గుతోంది.
జిల్లాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్న వాటిల్లోనూ ప్రయాణికుల సంఖ్య 20–35 శాతానికి మించడం లేదు. గతంలో రాష్ట్ర ఆర్టీసీకి రోజుకు రూ.10 కోట్లు ఆదాయం వస్తే.. ఇప్పు డది రూ.2 కోట్లకు పడిపోయింది. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని 70 % మంది అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్య రక్షణ కోసం తమ సొంత వాహనాలనే వినియోగిస్తున్న వారి సంఖ్య దేశంలో గతం కన్నా 19.8 % పెరిగిందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో సొంత వాహనాలు వినియోగిస్తున్న వారు 25% పెరిగారని, అందుకే ప్రధాన కూడళ్ల వద్ద రద్దీ సాధారణం కన్నా అధికంగా ఉంటోందని ట్రాఫిక్ విభాగం చెబుతోంది.
సెకండ్ హ్యాండ్ వాహనాలకు గిరాకీ...
ఇక దేశ వ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ వాహనాలకు గిరాకీ పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందున్న ధరల తో పోలిస్తే సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌ల ధరలు తగ్గడంతో వీటిని కొనేందుకు అధిక శ్రద్ధ కనబరుస్తున్నారు. మారుతి స్విఫ్ట్,, హ్యుందాయ్ శాంట్రో, స్విఫ్ట్ డిజైర్, హోండా సిటీ, శాంట్రో జింగ్, వంటి కార్ల కొనుగోళ్లకు వినియోగదారులు ప్రాధాన్యమిస్తున్నట్లు కార్స్–24 తన సర్వేలో తెలిపింది. వ్యక్తిగత భద్రత దృష్ట్యా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేస్తున్నట్లు సర్వే తేల్చింది. ఇక రాష్ట్రం లోని రామ్‌కోఠి, కింగ్ కోఠిలోనూ వీటి కొనుగోళ్లపై అధికులు ఆసక్తి కనబరుస్తున్నారని, ముఖ్యంగా హోండా యాక్టీవా, ప్యాషన్, స్కూటీలు కావాలని అడుగుతున్నారని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు.
మెట్రో మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ల సర్వే...
► దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ తర్వాత ప్రజా రవాణా తగ్గిన శాతం: 25
► సొంత వాహనంలో ఇతరులను ఎక్కించుకునేందుకు ఇష్టపడని వారి శాతం: 67.5
► వాహనాలను వారానికి ఓ సారి శానిటైజ్ చేస్తున్నవారి శాతం: 66
► ఏసీ వినియోగాన్ని తగ్గించిన వారి శాతం: 26
ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణ దూరం(సగటున)..
► లాక్‌డౌన్‌కు ముందు: 15–30 కి.మీ.
► లాక్‌డౌన్ తర్వాత: 5–10 కి.మీ.
► (సామాజిక దూరంపై ప్రజల్లో పెరిగిన అవగాహన దృష్ట్యా దూరపు ప్రయాణాలు తగ్గినట్లు తెలుస్తోందని ఈ సర్వే వెల్లడించింది)
సెకండ్ హ్యాండ్ వాహనాలపై కార్స్ 24 సర్వే
► లాక్‌డౌన్ తర్వాత కొనుగోలు పెరుగుదల: 25 శాతం
► లాక్‌డౌన్ ముందు ఒక కారు ధర (సగటున): 2.60 లక్షలు, తర్వాత ధర(సగటున): 2.25 లక్షలు
► లాక్‌డౌన్ తర్వాత బైక్ ధర(సగటున): 2535 వేలు
Comments
Please login to add a commentAdd a comment