డెంగీతో చిన్నారి మృతి | People Suffering With Viral Fever in Hyderabad | Sakshi
Sakshi News home page

ఫీవర్‌..ఫియర్‌

Aug 28 2019 10:55 AM | Updated on Aug 31 2019 12:16 PM

People Suffering With Viral Fever in Hyderabad - Sakshi

రిపోర్టుల కోసం ఆసుపత్రి ప్రధాన గేటు వరకు క్యూలైన్‌లో వేచి ఉన్న రోగులు

నల్లకుంట: నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి రోగుల తాకిడి కొనసాగుతోంది. జ్వరపీడితులు ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్‌లో వేచి ఉంటున్నారు. ఓపీ ప్రారంభ సమయానికి ముందే దాదాపు 500 మంది వరకు క్యూలైన్‌లో వేచి ఉంటుండడం గమనార్హం. ఉదయం 8.30 గంటకు ఓపీ చీటీలు జారీ చేస్తుండగా, 9 గంటలకు ఓపీలో రోగులకు చికిత్సలు ప్రారంభిస్తున్నారు.   చికిత్సల కోసం వచ్చే వారిలో అధికంగా వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్న వారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. 

గాంధీ నుంచి నలుగురు వైద్యులు..
ఫీవర్‌లో రోగుల రద్దీ కారణంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం గాంధీ ఆసుపత్రి నుంచి నలుగురు వైద్యులను డిప్యుటేషన్‌ పంపించారు. సోమవారం డిప్యూటేషన్‌పై వచ్చిన మరో వైద్యుడు మంగళవారం సెలవుపై వెళ్లడం విస్మయాన్ని కలిగిస్తుంది.

రోగుల సేవలో ఆర్‌ఎంఓ,డిప్యూటీ ఆర్‌ఎంఓలు..
రోగుల తాకిడి పెరగడంతో ఫీవర్‌ ఆర్‌ఎంఓ, డిప్యూటీ ఆర్‌ఎంఓలు ఎమర్జెన్సీ ఓపీలో కూర్చుని రోగులను పరీక్షించారు.  మరో 30 మంది వైద్యులు, హౌజ్‌ సర్జన్లు 30 కౌంటర్లలో రోగులను పరీక్షించారు.   

రిపోర్టుల కోసం భారీ క్యూ..
గంటల తరబడి క్యూలో వేచి ఉండడం ఒక  సమస్య అయితే..రిపోర్టులు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. రిపోర్టుల జారీకి ఒక్కటే కౌంటర్‌ ఉండడంతో రోగులు ఆసుపత్రి ప్రధాన గేటు బయటి వరకు క్యూ కడుతున్నారు. అతి కష్టం మీద రిపోర్టులు తీసుకుని వెళితే, ఓపీలో వైద్యుల వద్దకు చేరుకోవాలంటే మరో గంట క్యూలైన్‌లో వేచి ఉంటే కాని వైద్య పరీక్షలు అందని పరిస్థితి.   

డెంగీతో చిన్నారి మృతి
చింతల్‌: డెంగీ జ్వరం బారిన పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలో జరిగింది. రంగారెడ్డినగర్‌ డివిజన్‌ పంచశీల కాలనీకి చెందిన ప్రభాకర్, పవన్‌ కుమారి ల కుమార్తె దర్శిని (4) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ఐదు రోజుల క్రితం దర్శిని తీవ్ర జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న క్లినిక్‌కు తీసుకువెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యలు డెంగీ జ్వరంగా తేల్చారు. నగరంలోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం  మృతి చెందింది.  

జేసీ ఆకస్మిక తనిఖీ
నల్లకుంట: ఫీవర్‌ ఆసుపత్రిలో రద్దీని, వైద్యసేవలను హైదరాబాద్‌ ఇల్లా జాయింట్‌ కలెక్టర్‌(జేసీ) జి. రవి మంగళవారం మధ్యాహ్నం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జె. వెంకటి, ఆర్డీఓ డి.శ్రీనివాస్‌ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ముందుగా ఓపీ ఫార్మసీ కౌంటర్లను, ఓపీ విభాగాన్ని పరిశీలించారు. ఓపీలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరాతీశారు. ఆసుపత్రి సీఎస్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ పద్మజ, డిప్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్‌ రేణుక రాణిలతో మాట్లాడారు.ఓపిలో రద్దీని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కోసం  ఆసుపత్రి ఆవరణలోని కొన్ని భవనాలను పరిశీలించారు.  అదనపు ఓపీ కౌంటర్ల ఏర్పాటుకు లెక్చర్‌ హాల్‌ అనుకూలంగా ఉంటుందని ఆసుపత్రి అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement