
ఒక ఊళ్లో ఒక కోడి, దాని పిల్లలు ఉండేవి. అవి రోజూ పగలు, రాత్రి ‘క్కొ.. క్కొ.. క్కొ..’ అని, ‘ట్వియ్ ట్వియ్’ అరుచుకుంటూ ఊరంతా తిరుగుతుండేవి. రానురాను వీటి అరుపులతో ఊరి ప్రజలకు నిద్ర లేకుండా పోయింది. దాంతో అందరూ ఆగ్రహించి.. కోడిని, కోడి పిల్లలను ఊళ్లో నుంచి తరిమేశారు. కోడి తన పిల్లలను తీసుకుని పొరుగూరికి వెళ్లింది. కొత్త వాతావరణం చూసి కోడిపిల్లలు మరింత ఆనందంతో ఇంకా గట్టిగా ‘క్కొ.. క్కొ.. క్కొ.. క్కొ..’ అని అరవడం ప్రారంభించాయి. అవి అలా ఊరంతా తిరుగుతూ ఎడతెరపి లేకుండా అరుస్తుండడంతో ఊరివాళ్లు చికాకుపడి కోడిని, దాని పిల్లలను ఆ ఊరి నుంచి కూడా తరిమేశారు. కోడి మళ్లీ తన పిల్లలను తీసుకుని ఇంకొక ఊరికి వెళ్లింది. అక్కడకూడా వీటి అరుపులు భరించలేక అందరూ తరిమేశారు. ఇలా అన్ని ఊళ్లూ తిరగలేక కోడికి విసుగు వచ్చింది. అడవిలోకి వెళ్లిపోయి, తన పిల్లలతో కలిసి అక్కడే ఉండటం ప్రారంభించింది.
ఇక్కడ కోడి, కోడిపిల్లల కూతలు లేకపోవడంతో జనాలకు తెల్లవారుజామునే లేవడం ఆలస్యం అవుతోంది. దాంతో పనులన్నీ ఆలస్యమైపోతున్నాయి. చివరకు అన్ని ఊళ్లలోని జనం కోడిని, దాని పిల్లలను వెతుక్కుంటూ వచ్చి దయచేసి తమ ఊరికి రమ్మంటూ బతిమాలారు. అప్పుడు కోడి ఒక్కొక్క ఊరివారికి ఒక్కొక్క కోడిపిల్లను ఇచ్చి ‘‘దీనిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి’’ అని చెప్పింది. కోడిపిల్లలు పెద్దవై కొక్కొరొక్కో అని కూయడంతో ఆయా గ్రామాల ప్రజలు తెల్లవారినట్లు తెలుసుకుని నిద్రలేచి తమ దైనందిన చర్యలలో పడటం అలవాటుగా మార్చుకున్నారు. మంచి చెప్పేవారికి, పదిమందికీ మేలు చేసేవారికి కూడా ఒక్కోసారి కోడికి ఎదురైన అనుభవం ఎదురు కావచ్చు. అంతమాత్రాన నిరాశ పడి ఊరుకోకూడదు. తమ ప్రబోధాలను, తాము చేసే మంచిని కొనసాగిస్తుండాలి.
– డి.వి.ఆర్
Comments
Please login to add a commentAdd a comment