గంపెడాశలు! | people waiting for debt waiver | Sakshi
Sakshi News home page

గంపెడాశలు!

Published Thu, May 29 2014 11:05 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

people waiting for debt waiver

 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ కష్టజీవుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ చేసిన రూ.లక్షలోపు రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం రాజకీయ పార్టీల ప్రధాన బాధ్యత. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ ‘రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ’ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది.

తాజాగా ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుండడంతో ఖరీఫ్‌లో రుణమాఫీతో కొంతైనా ఊరట లభిస్తుందని అన్నదాతలు భావిస్తున్నారు. మరోవైపు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లలోనూ హడావుడి మొదలై ంది. ఎస్‌ఎల్‌బీసీ (రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ) రైతుల రుణాల లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రిన్సిపల్ బ్యాంకులకు మార్చి 31, 2014 నాటికి మంజూరు చేసిన రుణాల వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో రైతులకిచ్చిన రుణాల వివరాలపై బ్యాంకు అధికారులు కుస్తీ మొదలుపెట్టారు.

 ఏ కేటగిరీ ఎంతెంత?
 రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించినప్పటికీ.. వాటికి సంబంధించిన నిబంధనలపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే రుణమాఫీ అమలుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే అప్పటికప్పుడు సమాచార సేకరణ కష్టమవుతుందని భావించిన బ్యాంకర్లు ముందస్తుగా వివరాలను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా రైతులకు రెండు ప్రధాన విభాగాల్లో రుణాలిస్తారు. స్వల్పకాలక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. ఈ రెండు కేటగిరీల్లో ఇచ్చిన రుణాలు ఎంత ఉన్నాయన్న విషయంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు.

  ప్రస్తుతం జిల్లా గ్రామీణ పరిధిలో 360 ప్రభుత్వరంగ బ్యాంకులున్నాయి. ఈ బ్యాంకుల రుణవితరణకు సంబంధించిన సమాచార సేకరణలో లీడ్ బ్యాంకు అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు బ్యాంకులన్నింటికీ లేఖలు రాసిన ఎల్‌డీఎం త్వరలో జరిగే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం నాటికీ రుణాల వివరాలను అందచేయాలని నిర్దేశించారు. అయితే, ఇప్పటివరకు ప్రాథమికంగా రూ.18 కోట్ల మేర ప్రభుత్వరంగ బ్యాంకులు రైతులకు అప్పులు ఇచ్చినట్లుగా గుర్తించారు. బ్యాంకుల వారీగా స్పష్టమైన రుణ సమాచారం అందేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

 పీఏసీఎస్‌ల ‘లెక్క తేలింది’..
 ప్రధాన బ్యాంకుల రుణాలకు సంబంధించి రుణాల లెక్కలపై స్పష్టత రాలేదు. ఆయా బ్యాంకుల్లో పని ఒత్తిడి, మరోవైపు లీడ్ బ్యాంక్ మేనేజర్(ఎల్‌డీఎం) మారడంతో వివరాల అంశం కొలిక్కి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండగా.. హైదరబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (హెచ్‌డీసీసీబీ) పరిధిలోని పరపతి సంఘాలు ఇచ్చిన రుణాల లెక్క కొలిక్కి వచ్చింది. హెచ్‌డీసీసీబీ పరిధిలో 49 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలున్నాయి.

 వీటి పరిధిలో స్వల్పకాలిక రుణాల కోటాలో 53,394 మంది రైతులకు రూ.148.37కోట్ల రుణాలు మంజూరు చేశారు. అదేవిధంగా దీర్ఘకాలిక రుణాల కోటాలో 16,295 మంది రైతులకు రూ.76.17కోట్లు ఇచ్చారు. అదేవిధంగా నేరుగా ఇచ్చిన రుణాల కోటాలో రూ. 5.14కోట్ల రుణాలిచ్చారు. మొత్తంగా రూ.229.68 కోట్ల రుణాలిచ్చినట్టు తేలింది. ఈ మేరకు వివరాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఆ బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కొండ్రు రాందాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement