
భయపెడుతున్న చిరుత సంచారం
సంగారెడ్డి రూరల్: మండల పరిధిలోని ఇంద్ర కరణ్ పొలిమేరల్లో సంచరిస్తున్న చిరుతతో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల రక్షణ కరువైంది. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పాటు ఆ సమీపంలోనే చిరుత సంచరిస్తున్న అనవాళ్లు కనిపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురౌతున్నారు.
గత వారం రోజులుగా గ్రామ పొలిమేరల్లోనే చిరుత సంచరిస్తూ ఏడెనిమిది గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు సార్లు గ్రామ రైతులకు కనిపించడంతో ప్రజలు మరింత భయానికి లోనౌతున్నారు. ఈ నేపథ్యంలో చిరుత ఆనవాళ్ల కోసం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో సైతం చిరుత దృశ్యాలు కనిపించాయి. దీంతో చెరకు తోట సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు రక్షణ కరువైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
పాఠశాలకు ఆవరణ పెద్దగా ఉన్నప్పటికీ ప్రహరీ లేకపోవడంతో చిన్నారులు మూత్ర విసర్జన కోసం, ఆడుకునేందుకు ఆవరణ అంతా తిరుగుతుంటారు. ఆవరణ చుట్టుతా చిట్టడవిలా ముళ్ల చెట్లు, పొదలు నిండి ఉన్నాయి. దీంతో పాటు చిరుత తరుచూ కనిపిస్తున్న చెరకు తోట పాఠశాలకు దగ్గరగా ఉండడంతో విద్యార్థులకు రక్షణ కరువై ప్రమాదం పొంచి ఉంది. ఏ ప్రమాదం జరగక ముందే చిరుతను త్వరగా పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.