ఉన్నత చదువులు లేకే వెనుకబాటు
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నత చదువులు చదవకపోవడంతోనే 60 ఏళ్ల సీమాంధ్ర పాలనలో వెనుకబాటుకు గురయ్యామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో సోమవారం ‘ఆచార్య జయశంకర్ బడి పండుగ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడిబాట కార్యక్రమం ఈ నెల 16 నుంచి జూలై 2 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అందులో భాగంగానే జిల్లాలో యాపల్‌గూడలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. యాపల్‌గూడలో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే వంద మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు రప్పించడం అభినందనీయమన్నారు. యాపల్‌గూడ ప్రాథమిక పాఠశాలను ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులకు మంత్రి సర్టిఫికెట్లు, దుస్తులు, పుస్తకాలు అందజేశారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు చిన్నారులు సమాధానం చెప్పడంతో అందరూ వారిని అభినందించారు. మంత్రిని గ్రామస్తులు సన్మానించారు. పలు సమస్యలను గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అందరూ మొక్కలు నాటాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సర్పంచ్ ఇస్రూబాయి, ఉప సర్పంచ్ తిరుపతి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, ఆర్వీఎం పీవో శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, డీఈవో సత్యనారాయణరెడ్డి, ఎంఈవో జయశీల, పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ లక్ష్మి, ఎంపీటీసీ శ్రీవాణి, ప్రధానోపాధ్యాయులు తురాటి గంగన్న, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రైతులకు నమ్మకం కలిగించాలి
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : సహకార బ్యాంకు కమర్షియల్ బ్యాంకుల కంటే ఎక్కువగా ప్రజల్లో నమ్మకం కల్పించాలని మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం జిల్లా సహకార బ్యాంకు ఆధ్వర్యంలో మంత్రి రామన్నను, ఎంపీ గోడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును ఘనంగా సన్మానించారు. అంతకుముందు డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గోనె హన్మంత్‌రావు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులందరికీ రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, బ్యాంకు సీఈవో హన్మంత్‌రావు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి బిజీబిజీ
కలెక్టరేట్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న మంగళవారం పలు శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్‌లోని అటవీ శాఖ అతిథి గృహంలో వ్యవసాయ శాఖపై అధికారులతో సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఒంటి గంటకు విద్యుత్ సమస్యపై సమావేశం, 3 గంటలకు పంచాయతీ రాజ్ శాఖ, ఐటీడీఏ, అటవీ సంక్షేమంపై అధికారులతో సమావేశం కానున్నారు.