ఉప్పరిగూడలో వాల్వు తిప్పుకుంటున్న గ్రామస్తులు
ఇబ్రహీంపట్నంరూరల్ : పంచాయతీల్లో సేవలు స్తంభించిపోయాయి. కార్మికులు సమ్మెబాట పట్టడంతో గ్రామాలు సమస్యల్లో కునారిల్లుతున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రజల గోడు పట్టించుకునే వారే కరువయ్యారు. గత నెల 23వ తేదీ నుంచి పంచాయతీ కార్మికులు వారి సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నారు. జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 4వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.
ప్రతి గ్రామపంచాయతీలో కారోబార్, బిల్ కలెక్టర్, వాటర్‌మెన్, ఎలక్ట్రీషియన్, అటెండర్, పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తారు. ప్రస్తుతం వారంతా సమ్మె చేస్తుండడంతో పనులు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో పదిహేను రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. వాటర్‌మెన్ సమ్మెలో ఉండడం వల్ల నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు రూ.300 నుంచి రూ.500 వెచ్చించి ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించుకుంటున్నారు.
కొన్నిచోట్ల ప్రజలే స్వయంగా వాల్వ్ తిప్పుకుని నీటి సరఫరా చేసుకుంటున్నారు. ఇలా ప్రతి గ్రామంలో నీటి సమస్య జఠిలమైంది. చాలా గ్రామాల్లో మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్త చెదారం పేరుకుపోయి గ్రామాలు మురికికుపాలుగా తయారయ్యాయి. ఎలక్ట్రీషియ న్ అందుబాటులో లేకపోవడంతో లైట్లు వేసే వారు కూడా కరువయ్యారని, పాడైన లైట్లను మార్చడం లేదని ప్రజలు చెబుతున్నారు. ప్రజలే వీధి దీపాలు వేసుకుంటున్నారు. ఇటీవల గ్రామస్తులంతా నీటి కోసం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి ప్రత్యేక అధికారులకు సమస్యలు విన్నవించారు.
నీళ్లు లేవు
పంచాయతీ సిబ్బంది నీళ్లు పెట్టడం లేదు. వారం రోజుల క్రితం మా కుటుంబంలో ఒకరు మరణించారు. స్నానాలు చేయాలన్నా, ఇంటిని శుభ్రం చేసుకోవాలన్నా నీరు కరువైంది. రూ.500 పెట్టి ట్యాంకర్ నీటిని కొన్నాం. నీటి సమస్య తీవ్రంగా ఉంది.
– దేవరకొండ యాదమ్మ, పోచారం
Comments
Please login to add a commentAdd a comment