రౌనక్ నిర్మించుకున్న ఎత్తైన కొండ ఇదే..
సాక్షి, బంజారాహిల్స్: ఆయన అందరిలా ఉండాలనుకోలేదు.. ఏదో ఒక ప్రత్యేకతతో పది మందిలో నిలవాలనుకున్నాడు.. అందుకోసం కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని కూడా లెక్క చేయలేదు.. ఏళ్ల తరబడి కష్టపడి ఓ కొండనే నిర్మించుకున్నాడు. హైదరాబాద్ మొత్తాన్ని వీక్షిస్తూ టీ తాగాలన్న ఒకే ఒక్క కోరికతో ఆ కొండను మలిచాడు. ఆయనే 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ (గ్రేట్ గ్రాండ్ ఫాదర్) ముని ముని మనవడు రౌనక్ యార్‌ఖాన్. ఆయన ప్రత్యేకతలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీని ఆనుకొని రౌనక్ యార్‌ఖాన్‌కు 75 ఎకరాల స్థలం ఉంది. దీన్ని బూత్ బంగ్లా స్థలమని కూడా పిలుస్తుంటారు. తరచూ ఈ స్థలంలో సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి. పదేళ్ల క్రితం రౌనక్‌కు ఓ ఆలోచన వచ్చింది. అత్యంత ఎత్తైన కొండ మీద కూర్చొని చాయ్ తాగుతూ హైదరాబాద్‌ను చూడాలని ఆ కోరిక. దాన్ని అమల్లో పెట్టేందుకు సుమారుగా రూ.5 కోట్లు ఖర్చు చేశాడు.
ఆ స్థలంలోనే ఏడు ఎకరాల్లో 8 ఏళ్ల పాటు శ్రమించి లారీలతో ప్రొక్లెయిన్లతో మట్టి, రాళ్లను పేర్చుకుంటూ 180 అడుగుల ఎత్తులో కొండను మలిచాడు. ఆ కొండపైన ఎకరం విస్తీర్ణంలో లాన్, షెడ్డు, చిన్నచిన్న పార్టీలు చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించాడు. ఆ కొండపై కూర్చొని చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. చార్మినార్, గోల్కొండ నుంచి హుస్సేన్‌సాగర్, మౌలాలి గుట్ట కూడా కనిపించాల్సిందే. 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్‌గా తాను ఈ కొండను మలుచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా రౌనక్ యార్‌ఖాన్ తెలిపాడు. జూబ్లీహిల్స్ అంటేనే కొండలు.
ఆ కొండల్లోనే ఆయన ఇంకో కొండను మలిచాడు. వర్షం పడ్డప్పుడు ఈ కొండపైన కూర్చుంటే కశ్మీర్‌ను తలపిస్తుందని ఈ సందర్భంగా రౌనక్ వెల్లడించాడు. రాత్రి పూట చూస్తే విద్యుత్ దీపాల కాంతుల్లో నగర ధగధగలు కనువిందు చేస్తాయన్నారు. దీనిపైన ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం హాలును కూడా నిర్మించానని, ఔత్సాహికులు ఈ కొండపైన తమ చిత్రకళా ప్రదర్శనను ప్రత్యేకతతో ఏర్పాటు చేసుకుంటారన్నారు.
ఇక గత 35 సంవత్సరాలుగా బూత్ బంగ్లా ప్రాంతంలో కులమతాలకు అతీతంగా హోలీ వేడుకలు నిర్వహిస్తున్నానని, గత 6 ఏళ్లుగా ఈ హోలీ వేడుకల్ని తాను నిర్మించిన గుట్టపైనే చేస్తున్నానని తెలిపాడు. 105 ఏళ్లుగా ఈ స్థలం తమ ఆధీనంలోనే ఉందని ఇక్కడ ప్లాట్లు చేసి విక్రయిస్తే కోట్లాది రూపాయలు వస్తాయని, అది తనకు ఇష్టం లేదన్నారు. ఈ కొండనే తనకు పూర్తి సంతృప్తిని ఇస్తున్నదన్నారు. ప్రతిరోజూ సాయంత్రం పూట ఇక్కడకు వస్తుంటానని ఒంటరిగా కుర్చీలో కూర్చొని నగరాన్ని చూస్తుంటే ఎన్ని కోట్లు వెచ్చించినా ఆ ఆనందం రాదన్నారు. ఇదిలా ఉండగా నిజాం హయాంలో రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఈ స్థలంలోనే ఒక బంకర్ నిర్మించారని ఎయిర్ రైడ్ షెల్టర్ కూడా నిర్మించారని అవి ఇప్పటికీ ఈ స్థలంలో ఉన్నాయన్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లో తనకున్న 75 ఎకరాల స్థలాన్ని ఎప్పటికీ అమ్మేది లేదని, ఇలా ఉండటమే తనకు ఇష్టమన్నారు. ఈ స్థలం విలువ సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని తెలిపాడు. కొండ, దాని చుట్టూ అడవి ఉంటే ఆ ఆనందమే వేరన్నారు. దీన్ని ఇలాగే కాపాడుకుంటానన్నారు. కొండపైన ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించే యోచన ఉందన్నారు. తనకున్న ఈ ఖాళీ స్థలంలో రంగస్థలంతో పాటు ఎన్నో సినిమా షూటింగ్‌లు జరిగాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment