పెట్రోల్‌ బంకుల్లో కల్తీ దందా | Petrol Bunk Fraud In Warangal District | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకుల్లో కల్తీ దందా

Published Sat, Aug 31 2019 11:15 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

Petrol Bunk Fraud In Warangal District - Sakshi

సాక్షి, వరంగల్‌ : పెట్రోల్‌ బంకుల యజమానులు చాలాచోట్ల వాహనదారులను నిలువునా దోచేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా పలు బంకుల్లో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. కుదిరితే కొలతల్లో కోత పెట్టి ఇంధనాన్ని కాజేయడం.. లేదంటే కల్తీకి పాల్పడుతూ వినియోగదారుల జేబుకు చిల్లులు పెడుతున్నారు. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పెట్రోల్‌ ధరల భారంతో నలిగిపోతున్న వినియోగదారులను పెట్రోల్‌ బంకుల నిర్వాకం మరింత కుంగదీస్తోంది. వాహనదారుడి కళ్లముందే ఏళ్లుగా మాయాజాలం జరుగుతుండగా కళ్లు మూసుకున్న యంత్రాంగం... ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉరుకుల పరుగుల మీద ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టాయి.

పెట్రోల్‌ బంకులపై ఇవే ఫిర్యాదులు
చాలా పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ కొలత పూర్తి కాకుండానే పంపు ఆపేయడం, వేగంగా ట్యాంకు నింపడం.. అదే సమయంలో కొలతను సూచించే ఎలక్ట్రానిక్‌ మెషిన్‌పై చేయి అడ్డుపెట్టడం వంటి మోసాలకు సిబ్బంది పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదేమిటనీ ప్రశ్నిస్తే బంకు సిబ్బంది ఎలక్ట్రానిక్‌ యంత్రాలతో మోసాలకు తావులేదంటూ సర్దిపుచ్చడమే గాక వాహనదారులతో ఎదురు గొడవకు దిగుతున్నారు. చిల్లర డబ్బులతో పాటు ఇంధనాన్ని కాజేస్తూ, నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారన్న ఫిర్యాదులు కూడాన్నాయి.. లీటర్‌ పెట్రోల్, డీజిల్‌లో 30 నుంచి 50 మి.లీ. మేర కోత పెట్టడంతో పాటు కిరోసిన్, నీళ్లు కలుపుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలు బంకులపై ఆరోపణలు ఉన్నాయి.

దీంతో వినియోగదారులు తమ వాహనాలకు మరమ్మతులు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా, పెట్రోల్‌బంకుల్లో వసతుల విషయానికోస్తే అన్నీ గాలికొదిలేశారు. ఆయిల్‌ కంపెనీల అధికారులు పట్టించుకోకపోవడం.. తూనికలు కొలతల శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందునే సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని వాహనచోదకులు విమర్శిస్తున్నారు. బంకుల్లో ఉచిత గాలియంత్రం, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్, తాగునీరు ఇలాంటివేమీ కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

నామమాత్రంగా ప్రతేక్య బృందాల తనిఖీలు 
వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో హెచ్‌పీసీ, బీపీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, హిందుస్తాన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తదితర కంపెనీలకు చెందిన 267 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు సాగుతున్నాయి. అయితే కొన్ని పెట్రోల్‌ బంకుల్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఫిర్యాదులు ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్న ఫిర్యాదులు సంబం«ధిత శాఖల అధికారులపై ఉన్నాయి. నామమాత్రంగా తనిఖీ ముగించి రికార్డులు సృష్టించుకోవడం.. శాంపిళ్లు సేకరించడం తప్ప కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలే కానరావడం లేదు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

బంకుల్లో జరుగుతున్న కల్తీ, తూకంలో మోసాలను అరికట్టేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులతో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్త బృందాలుగా ఏర్పడి జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అయితే, ఈ సమయంలో రాజకీయ పలుకుబడి, నేపథ్యం ఉన్న వారి బంకుల జోలికి వెళ్లకుండా కొన్ని పెట్రోల్‌బంకుల్లోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి శాంపిళ్లను సేకరించారు. ఈ సందర్భంగా మొత్తం 267 బంకులకు 55 బంకుల్లో తనిఖీ చేసిన అధికారులు 23 బంకుల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని నిర్ధారించి చర్యలకు ప్రతిపాదించారు. కాగా, ఈ విషయమై పౌరసరఫరాల శాఖ వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ అధికారితో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.

తనిఖీలు నిర్వహించాం.. కల్తీ జరిగితే కఠిన చర్యలు
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని పెట్రోల్‌బంకుల్లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నేతృత్వాన ప్రత్యేక తనిఖీలు నిర్వహించాం. తూనికలు – కొలతల శాఖతో పాటు పౌరసరఫరాల శాఖ, ఆయా బంకులకు సంబంధించిన కంపెనీల ప్రతినిధులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రతీ విషయాన్ని పరిశీలించి తేడాలు ఉన్న చోట ఆయా శాఖల అధికారులు  నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పెట్రోల్‌ బంక్‌ల్లో అసౌకర్యాలు, కల్తీలను ఉపేక్షించేది లేదు.  – అనిల్‌కుమార్, లీగల్‌ మెట్రాలజీ అధికారి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement