పసుపు బోర్డు ఏర్పాటు చేయండి
కలెక్టరేట్: జిల్లా ప్రజలకిచ్చిన మాట మేరకు కల్వకుంట్ల కవిత ఎంపీగా తన తొలి లేఖ ద్వారా పసుపుబోర్డు కోసం విన్నవించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి ఎంపీ కవిత పసుపుబోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. అనంతరం మద్దతు ధర 15వేలుగా నిర్ణయించాలని వినతిపత్రం సమర్పించారు. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో భారతదేశం నుంచే 70 శాతం పసుపు ఎగుమతి కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి 57 శాతం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి 16 శాతం ఉత్పత్తి అవుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆహార, వైద్యం, వాణిజ్య పరంగా కూడా అత్యంత ప్రాధాన్యత గల ఈ పసుపు పంటకు ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పసుపుబోర్డు లేకపోవడం దురదృష్టకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పసుపు బోర్డు లేకపోవడం వల్ల రైతులకు అవసరమైన శిక్షణ లేకపోవడం, నూతన వంగడాల పరిశోధనలు జరుగకపోవడం, మార్కెటింగ్‌కు సంబంధించిన అవకాశాలు మెరుగుపడకపోవడాన్ని కవిత మంత్రి దృష్టికి తెచ్చారు. బోర్డు లేకపోవడం వల్ల పంటకు అవసరమైన ఇతర వసతుల కోసం స్థానిక ప్రభుత్వాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆమె వివరించారు. జాతీయ స్థా యిలో ఒక విధానం అంటు ఉండకుండా పోతుందని , సరైన మద్దతు ధర ఉండడం లేదని కవిత తెలిపారు.
టీ, కాఫీ, పొగాకులకు ఉన్నట్లు పసుపు పంటకు బోర్డు అవసరమని తెలిపారు. మద్దతు ధర లేకపోవడం వల్ల పసుపు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేందుకు బోర్డు ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో పాటు నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు పసుపు పండించే పసుపు రైతాంగం దళారి వ్యవస్థ వల్ల ధరలో 20 నుంచి 30 శాతం నష్టపోవాల్సి వస్తుందని మంత్రికి ఆమె వివరించారు. పసుపు స్టోరేజ్ కోసం మొదట గిడ్డంగులను ఏర్పాటు చేయాలని, పంటను నిల్వ చేసే అవకాశం ఉండడం వల్ల దళారుల దోపిడీ తగ్గుతుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా పసుపు శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల రైతులు తక్కువ ధరకే ముడి పసుపు అమ్మే అవసరం రాదని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు స్థానిక దిగుబడిని ఎగుమతి చేసేలా పసుపుబోర్డు ద్వారా జరగాలన్నారు.