భూదాన్ పోచంపల్లి (భువనగిరి): హైదరాబాద్‌లో ఈ నెల 28న జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సుకు హజరవనున్న ఇవాంకా ట్రంప్‌కు తెలంగాణ ప్రభుత్వం రెండు పోచంపల్లి పట్టుచీరలు, డైమండ్ నెక్లెస్ బహూకరించనున్నట్లు తెలిసింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి చేనేత కుర్తా, పైజామా బహుమానంగా ఇవ్వనున్నట్లు సమాచారం. సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు కూడా పోచంపల్లి వస్త్రాలు బహూకరించాలని.. తద్వారా చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఖ్యాతి, ప్రాచుర్యం వస్తుందని సర్కారు భావిస్తోంది. మూడు రోజులపాటు జరిగే సదస్సులో పాల్గొనే 200 మంది మహిళా వలంటీర్లు పోచంపల్లి కాటన్ మస్రస్ చీరలు ధరించనున్నారు. ఇందుకోసం పోచంపల్లిలో 200 ‘టెస్కో’రకం పట్టుచీరలను ప్రత్యేకంగా తయారు చేయించారు.
జీఈఎస్ అతిథులకు అమెరికా తేనీటి విందు
30న నోవాటెల్‌లో..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు వచ్చే అతిథులకు అమెరికా ప్రభుత్వం తరఫున స్థానిక యూఎస్ కాన్సులేట్ అధికారులు తేనేటి విందు ఇవ్వనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం నోవాటెల్‌లో విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా అమెరికా గురించి ప్రజెంటేషన్ కూడా ఉండనుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఈ నెల 28న చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, 29న రాష్ట ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment