శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో స్పీకర్ పోచారం, మంత్రులు ఈటల, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ తదితరులు
గన్‌ఫౌండ్రీ: సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గిరిజన సంక్షేమ సంఘం, సేవా ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ 281వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సాంప్రదాయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.
సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమన్నారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని కులాలు, మతాలు, సమానంగా గౌరవిస్తూ సాంప్రదాయాలు, ఆచారాలను కాపాడుతున్నారని తెలిపారు. బంజారా భవన్, కొమురం భీమ్ భవన్‌లను నిర్మిస్తున్నట్లు, త్వరలోనే వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర సమాచార హక్కుల కమిషనర్ శంకర్ నాయక్, పార్లమెంటు సభ్యులు బీబీపాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ సీతారామ్‌నాయక్, తెలంగాణ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment