‘రాష్ట్రపతి తరువాత చెక్‌పవర్‌ మీకే ఉంది’ | Pocharam Srinivas Reddy Says Sarpanches Have Check Power | Sakshi
Sakshi News home page

సర్పంచులదే కీలక పాత్ర

Published Fri, Sep 6 2019 10:37 AM | Last Updated on Tue, May 4 2021 4:25 PM

Pocharam Srinivas Reddy Says Sarpanches Have Check Power - Sakshi

మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌): గ్రామాలను హరితవనంగా, ఆరోగ్యంగా తీర్చి దిద్దడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. 30 రోజుల గ్రామ పంచాయతీల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై స్థానిక బీఎల్‌ఎన్‌ గార్డెన్‌లో గురువారం ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో రాష్ట్రపతి తరువాత సర్పంచ్‌ను మాత్రమే ప్రథమ పౌరుడు అంటారని, అలాగే రాష్ట్రపతి తరువాత సర్పంచ్‌కు మా త్రమే చెక్‌పవర్‌ ఉంటుందన్నారు. సర్పంచ్‌ పద వికి చట్టంలో అంత గౌరవం కల్పించారని అన్నా రు. ఆ గౌరవానికి వన్నె తెస్తూ గ్రామాల్లో సర్పం చులు గ్రామాల అభివృద్ధికి, పారిశుధ్య నిర్వహణకు, ఆరోగ్య గ్రామాలుగా తీర్చి దిద్దటానికి పాటు పడాలన్నారు. బాగా పని చేస్తే ఇదే రిజర్వేషన్‌లతో మళ్లీ ఎన్నికల్లో ప్రజలు వారినే ఎన్నుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు నిర్దేశించిన 30 రోజుల కార్యక్రమం ఎంతో ముందుచూపుతో  గ్రామాల అభివృద్ధిని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినదని అన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఇందుకు గాను పంచాయతీ చట్టం ప్రకారం గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే నెల రోజుల కార్యక్రమంలో వార్షిక, పంచవర్ష ప్రణాళికల కార్యచరణతో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయంతో ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి గ్రామాలకు ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తారని, ఈ నిధులు జనాభా ప్రతిపాదికగా సరాసరి ఒక్కొక్కరిపై రూ.1,605 మంజూరవుతాయని తెలిపారు. గ్రామాల్లో పరిశుభ్రతే కాకుండా స్వచ్ఛమైన తాగునీరు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పాడుబడ్డ బావులను పూడ్చాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు.

చేసేది మంచి పని కాబట్టి అది ఎటువంటి పని అయినా సరే తలవంచాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమాలతో పాటుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించాలని, వీలైతే వారితో కలిసి భోజనం చేయాలన్నారు. అలాగే సిక్కిం రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా సేంద్రియ ఎరువులతో చేస్తారని, అధిక రసాయన ఎరువులు, పురుగుల మందులు ఉపయోగించే రాష్ట్రాల్లో పంజాబ్‌ మొదటి స్థానంలో ఉందని, మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. దీని మార్పు కోసం మనమంతా ఆలోచించాలని ఉద్బోధించారు. ఈ మార్పు ఇప్పుడే మొదలైందని, మున్ముందు మరింత అవగాహనతో మార్పు రావచ్చని అభిలాషించారు. చట్టం కఠినంగా ఉందని, 30 రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలపై ఫ్లయింగ్‌ స్క్వార్డ్స్‌ పనితీరును పరిశీలిస్తాయన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పని చేయకుంటే ఇబ్బందులు తప్పవన్నారు.

అందరి సహకారంతోనే: కలెక్టర్‌ 
ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుందని కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో నాలుగు స్థాయీ సంఘాలను గ్రామ సభల ద్వారా ఎన్నిక చేసుకోవాలని, వాటి ద్వారా స్మశాన వాటికలు, వీధి దీపాలు, హరితహారం కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు ఆగకుండా మోరీలు శుభ్రం చేయాలని, చెత్తా చెదారం ఎక్కడ కూడా కనిపించవద్దన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలని, కోతుల బెడదను తప్పించుకోవడానికి అడవుల్లో, గుట్టల్లో పండ్ల మొక్కలు నాటాలన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్‌ దాదాన్న గారి విఠల్‌రావు మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేసి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దాలని సర్పంచులకు పిలుపునిచ్చారు.  సదస్సులో జిల్లా అటవీ అధికారి సునీల్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శన్, డీపీఓ జయసుధ, జెడ్పీ సీఈఓ గోవింద్, డీఆర్‌డీఓ రమేశ్‌ రాథోడ్, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రజిత, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీఓలు, సర్పంచులు పాల్గొన్నారు. 
సదస్సుకు హాజరైన సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement