
'రైతు మరణాలను రాజకీయం చేస్తున్నారు'
హైదరాబాద్: రాష్ట్రంలోని రైతు మరణాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం హైదరాబాద్లో ఆరోపించారు. రైతుల మరణాలన్నీ ఆత్మహత్యలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం జరగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యపై ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చెప్పారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. తాము కేంద్ర ప్రభుత్వ సహకారం కోరడం లేదంటూ... టి.టీడీపీ నేతల దుష్ప్రచారం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారమిస్తూ అవసమైన సహకారం కోరుతున్నామని పోచారం తెలిపారు.