బాబు వైఫల్యం వల్లే ఏపీలో భక్తులు మృతి
* వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
* తెలంగాణ సర్కార్, అధికారుల పనితీరు భేష్
భద్రాచలం నుంచి సాక్షి బృందం/బూర్గంపాడు: ఏపీలోని రాజమండ్రిలో జరుగుతున్న పుష్కరాల్లో సీఎం చంద్రబాబు వైఫల్యం వల్లే 27 మంది భక్తులు చనిపోయారని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం స్నానఘట్టాలు, సారపాకలోని ఐటీసీ అతిథి గృహంలో బుధవారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
రాజమండ్రిలో భక్తుల మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాట్లు తక్కువ, ప్రచార ఆర్భాటం ఎక్కువ కావడంతోపాటు అపర అనుభవశాలినని, మేధావినని భావించే ఏపీ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే భక్తుల ప్రాణాలు గోదావరి తల్లి వద్దకు చేరాయన్నారు. తాను ఈ విషయాన్ని రాజకీయంగా మాట్లాడటం లేదన్నారు. ఏ పార్టీ అయినా.. ఏ రాష్ట్రం అయినా ఏర్పాట్ల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే బలయ్యేది భక్తులేనన్నారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కనీసం బాధిత కుటుంబాలకు మెరుగైన ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. తెలంగాణలోని భద్రాచలం పుష్కర స్నానాలకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి, ఎస్పీ షానవాజ్ ఖాసీం, ఉద్యోగులందరూ శ్రమించారన్నారు. పుష్కర ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఉన్నా.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంను అంటిపెట్టుకుని ఉండి అధికారుల సమన్వయంతో పుష్కరాలను సక్సెస్ చేస్తున్నారన్నారు.
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గోదావరి నదిపై పుష్కర ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయన్నారు. స్నానఘట్టాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. ఆయన వెంట ఎంపీ సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పాలేరు, ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌చార్జీలు సాధు రమేష్‌రెడ్డి, డాక్టర్ రవిబాబునాయక్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమా శ్రీధర్, నేతలు తుంబూరి దయాకర్‌రెడ్డి, బూర్గంపహాడ్ ఎంపీపీ రోశిరెడ్డి, నేతలు వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాల్వంచ రూరల్: పక్షం రోజులుగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్నా.. వారి సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం ఖమ్మం జిల్లా పాల్వంచలో మున్సిపల్ కార్మికులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు కార్మికులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు.