ఇద్దరు ముఖ్యమంత్రులూ విఫలం
కార్మిక సమస్యల పరిష్కారంపై పొంగులేటి
కేసీఆర్, చంద్రబాబులవన్నీ ఉత్తమాటలేనని విమర్శ
జిల్లా కేంద్రాల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రులేవని ప్రశ్న
కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి
కార్మికులకు వెన్నుదన్నుగా వైఎస్సార్ సీపీ నిలుస్తుందని వెల్లడి
హైదరాబాద్: కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాల యంలో కార్మిక దినోత్సవం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ కార్మికుల కోసం కోటలు దాటే హామీలు ఇచ్చారని విమర్శిం చారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టి 11 నెలలు దాటిందని.. ఎంత మంది కొత్తవారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రాల్లో కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారని.. అది ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు. దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక రాజధానిగా హైదరాబాద్‌కు పేరుందని.. ఆటో నుంచి ఆటోమెటిక్ ఎనర్జీ తయారీ వరకు ఇక్కడ పరిశ్రమలు ఉండటం తెలుగువారికి గర్వకారణమని చెప్పారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్సార్ పాలన కార్మికులకు స్వర్ణయుగమని పొంగులేటి చెప్పారు.
2004కు ముందు సీఎంగా ఉన్న చంద్రబాబు 56 పరిశ్రమలను నామినేషన్ రేటుకు అమ్మకానికి పెట్టారని గుర్తుచేశారు. అదే వైఎస్సార్ సీఎం అయ్యాక ప్రభుత్వ పరిశ్రమలను సమర్థంగా నడిపించి, లాభాలు తీసుకువచ్చారన్నారు. కార్మికుల పక్షాన వైఎస్సార్ సీపీ సమరశీల ఉద్యమాలు చేపడుతుందని పొంగులేటి చెప్పారు. పార్టీ తెలంగాణ కార్మిక విభాగం అధ్యక్షుడు నర్రా భిక్షపతి మాట్లాడుతూ.. కేసీఆర్ అన్ని రకాల కాంట్రాక్టు కార్మికుల్ని పర్మనెంట్ చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. కాగా, పొంగులేటి జెండాను ఎగురవేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రెహవూన్, కె.శివకుమార్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, మహిళా విభాగం నేత ఎం.శ్యామల, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూని యన్ నేతలు భాస్కర్‌రావు, శివకుమార్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.