కంటి వైద్యం కోసం వెళితే కన్నే పోయింది..
Published Tue, Jul 19 2016 7:05 PM | Last Updated on Sat, Apr 6 2019 8:51 PM
గుంటూరు ఈస్ట్: శారదా కాలనీ 2వ లైనులో నివసించే∙షేక్ బాజీ బీ అనే వృద్ధురాలు కంటి వైద్యం కోసం ఆసుపత్రికి పోతే కన్ను పోయిందని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సోమవారం గ్రీవెన్స్‌లో ఆశ్రయించింది. కుడి కన్నులో పొర ఏర్పడటంతో కాటూరి మెడికల్ కళాశాలకు వెళ్లి మే 2వ తేదీ పరీక్ష చేయించుకున్నాక 3వ తేదీ ఆపరేషన్ చేశారంది. ఇంటికి వెళ్లిన దగ్గర నుంచి కన్ను విపరీతమైన నొప్పి ఏర్పడి కన్ను నీరు కారిందని వాపోయింది. ఒకటి రెండు సార్లు అదే ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా కన్ను పోయిందని కన్నీళ్లు పెట్టుకుంది. కాకానిలోని శంకర్ ఐ ఆసుపత్రికి వెళ్లమని ఉన్నతాధికారులు సూచించారంది. జూన్ నెల 15వ తేదీ శంకర్ ఐ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కాటూరి మెడికల్ కళాశాల వైద్యుల నిర్లక్ష్యంతోనే కన్ను పోయినట్లు నిర్ధారించారంది. ఈ నెల 8వ తేదీన అపరేషన్ చేసి కన్నును తొలగించారని గోడు వెల్లబోసుకుంది. విచారణ చేపట్టి న్యాయం చేయాలని అర్బన్ ఎస్పీని కోరింది.
Advertisement
Advertisement