ఎన్‌ఆర్‌ఐపై పోలీసుల దాష్టీకం
- ప్రవాస భారతీయుడిపై దాడి
- డబ్బుల కోసం డిమాండ్
- హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన బాధితుడు
- విచారణకు ఆదేశం
- పోలీసులపై వేటుపడే అవకాశం
నాంపల్లి/ముషీరాబాద్: ప్రవాస భారతీయుడిపై ముషీరాబాద్ పోలీసులు దాష్టీకం చేశారు. విచక్షణారహితంగా కొట్టి గాయపరచడంతో బాధితుడు వాసు మల్లాపురం సోమవారం మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపించి జులై 16లోగా నివేదికను అందజేయాలని హక్కుల కమిషన్.. నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. బాధితుడి కథనం ప్రకారం...మహేంద్ర హిల్స్ కు చెందిన వాసు మల్లాపురం 14 ఏళ్లుగా ఐర్లాండ్‌లో ఉంటున్నారు. వేసవి సెలవులకు నగరానికి వచ్చిన ఆయన ఈనెల 25న ముషీరాబాద్‌కు చెందిన తన స్నేహితులు ప్రీతమ్, నిఖిల్‌లతో కలిసి కోఠిలో ఓ హోటల్‌లో మద్యం తాగాడు.
ఆ తర్వాత వారిని వదిలేందుకు ముషీరాబాద్ అనూషా అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన అతను కారును పక్కన ఆపి స్నేహితులతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది అర్ధరాత్రి రోడ్డుపై ఏమి చేస్తున్నారంటూ తమపై దాడి చేసినట్లు తెలిపాడు. దీనిపై ప్రశ్నించడంతో పోలీసులకే ఎదురు చెప్తారా తమను స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టినట్లు తెలిపా రు. అన ంతరం సీఐ దగ్గరకు తీసుకెళ్లగా అతను తమను దారుణంగా అవమానించడమేగాక, తమ ఫోన్లు లాక్కున్నారని, రూ. రూ.5 లక్షలు ఇస్తే వదిలి వేస్తానని, లేనిచో పాస్‌పోర్టులు సీజ్ చేస్తానని చెప్పాడన్నారు. లేని పక్షంలో పరారీలో ఉన్నాడంటూ మళ్లీ లోపల వేసి బొక్కలు ఇరగ్గొడతానని హెచ్చరించాడన్నారు. అంతేగాకుంగా తన స్నేహితుడిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారని వాపోయారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆతను కోరాడు.
ఘటనపై డీసీపీ విచారణ
కాగా ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారుల ఆదేశంతో సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ బిట్టు మోహన్‌కుమార్, సెక్టార్ ఎస్సైలు సంపత్, భాస్కర్‌రావులను డీసీపీ కార్యాలయాలని పిలిపించారు. సమస్య హెచ్‌ఆర్సీ వరకు వెళ్లినా ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితుల్లో ఒక్కరిపై మాత్రమే కేసు నమోదు చేసి మిగతా ముగ్గుర్నీ ఎందుకు వదిలి పెట్టారని ప్రశ్నించిన ట్లు తెలిసింది. ఈ ఘటనకు బాధ్యులైన కానిస్టేబుళ్లు, ఎస్సైపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదేనా భద్రత
హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు సెక్షన్-8 అమలు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నా వద్దనుకున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నా సిబ్బందిలో మార్పురావడం లేదు. తప్పు చేయని వ్యక్తులపై పోలీసులు దాడి చేయడం దారుణం. వాసు మల్లాపురంపై జరిగిన దాడి హైదరాబాదులో శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతోంది. - ఎస్.చంద్రశే ఖర్
( గ్రీన్ ఫీల్డ్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు)