
సాక్షి, హైదరాబాద్: మహిళను దుర్భాషలాడుతూ వేధింపులకు గురిచేసిన టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు వ్యవహారంలో కొత్త ట్విస్ట్ ఎదురైంది. తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆగస్టులో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు నెలలు గడుస్తున్నా కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. దీంతో నాలుగు రోజుల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఒకే వ్యవహారంపై అటు కోర్టులో ఇటు పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు ఉండటం వల్ల చట్టపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నామాపై కోర్టులో తేల్చుకుంటారా? లేక పోలీసు కేసుతో తేల్చుకుంటారా? అన్న దానిపై బాధితురాలికి ఆప్షన్ ఇచ్చినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
మా పని మేము చేస్తాం: పోలీసులు
తమకు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నామని జూబ్లీహిల్స్ పోలీసులు స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన బాధితురాలి వాంగ్మూలం సేకరించే పనిలో ఉన్నామని, నామా వేధింపులు, దాడికి పాల్పడ్డ వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో ఫుటేజీలు బాధితురాలి నుంచి సేకరిస్తామని పోలీసులు చెబుతున్నారు.
బాధితురాలి ఇష్ట్రపకారం కోర్టులో పోరాడే హక్కు ఉందని, అలా కాక పోలీసు కేసు ద్వారా వెళ్లేందుకు కూడా అవకాశం ఉందని తెలిపారు. ఎలా అన్నది బాధితురాలి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టంచేశారు. కేసు నమోదైన తర్వాత చట్టప్రకారం తమ విచారణ సాగుతుందని, నామాకు త్వరలోనే నోటీసులిచ్చి వాంగ్మూలం సేకరిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment