
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా విడాకులిచ్చి తనతోపాటు ఉండాల్సిందిగా నామా వేధిస్తున్నారని నగరాని కి చెందిన రామకృష్ణన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో నివసించే సి.కె.రామకృష్ణన్ 1992 నుంచి అమెరికా లో ఉంటున్నారు. ఆయన భార్య సుజాత రామకృష్ణన్ అక్కడే ఉండేవారు.
2014లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మాజీ ఎంపీ నామా తరచూ వారి ఇంటికి వస్తుండేవారు. 2017లో తరచూ తన భార్య సుజాతతో ఫోన్‌లో మాట్లాడేవాడని రామకృష్ణన్ తెలిపారు. తాను అమెరికాలో ఉన్నప్పుడే భార్య గత అక్టోబర్‌లో ఫోన్ చేసి నామా, ఆయన తమ్ముడు నామా సీతయ్య తనను బెదిరిస్తున్నారని, భయంగా ఉందంటూ ఫోన్ చేయడంతో ధైర్యం చెప్పానన్నారు. అప్పుడే సుజాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు పెట్టిందన్నారు.
ఇటీవల వేధింపులు తీవ్రతరం
2 రోజుల క్రితం తాను హైదరాబాద్‌కు వచ్చానని, మానసిక వేదనతో బాధపడుతున్న భార్య సుజాతను ప్రశ్నించగా.. కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు నామాతో 2013 నుంచి వివాహేతర సంబంధం ఉందంటూ విషయాన్ని బయట పెట్టిందన్నారు. భర్తకు విడాకులిచ్చి తనతోపాటు ఉండాల్సిందిగా నామా ఒత్తిడి తెస్తున్నాడని, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన తమ్ముడు సీతయ్య కూడా గత కొంత కాలంగా తనను బెదిరిస్తున్నాడని ఆమె వెల్లడించారన్నారు. ఈ మేరకు రామకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నామా నాగేశ్వర్‌రావు, సీతయ్యపై ఐపీసీ సెక్షన్లు 497, 504, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment