యువతిని గర్భిణిని చేసిన కానిస్టేబుల్
ఓ ఖాకీ ఘరానా మోసం బయటపడింది. ఓ యువతికి మాయమాటలు చెప్పిన కానిస్టేబుల్ గర్భిణిని చేశాడు. యువతి ఇంట్లో విషయం తెలియడంతో పెద్దలు అతడితో వివాహం జరిపించారు. ఇదివరకే వివాహం జరిగిన విషయాన్ని దాచి కొద్ది రోజులు కాపురం చేశాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి వస్తానని చెప్పి ఆపై ముఖం చాటేశాడు. ఈ మేరకు బాధితురాలు గురువారం జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. బాధితురాలు ఫరీన్, జోగిపేట సీఐ నాగయ్య విలేకరులతో వెల్లడించిన వివరాలు ఇలా...
టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తోన్న పాండురాజు కుటుంబం జోగిపేట హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటోంది. అతని మరదలు పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఫరీన్ (25) కూడా వీరి వద్దే ఉంటుంది. సంగారెడ్డి సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న సీహెచ్ ఆనంద్ హెచ్‌కానిస్టేబుల్ పాండురాజుకు మంచి స్నేహితుడు. ఆనంద్ తరచూ పాండురాజు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అతడి కన్ను పాండురాజు మరదలు ఫరీన్‌పై పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆనంద్ వచ్చి ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు.
ఎవరికి చెప్పవద్దంటూ చాకుతో బెదిరించేవాడు. ఇలా భయపెట్టి చాలాసార్లు బలత్కారం చేయడంతో ఏడాది క్రితం ఆమె గర్భం దాల్చింది. విషయం అతడికి చెప్పడంతో మాయమాటలు చెప్పి సంగారెడ్డిలోని ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. కొద్ది రోజుల తర్వాత ఈ విషయం తన బావ పాండురాజుకు తెలియడంతో ఆనంద్‌తో మాట్లాడి అందోలు మండలం కిచ్చన్నపల్లి వెంకటేశ్వరాలయంలో వివాహం జరిపించారు.
కొంతకాలంపాటు ఇద్దరు జోగిపేటలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం చేశారు. తనకు ఇదివరకే వివాహమైనట్టు ఆనంద్ దాచిపెట్టాడని ఫరీన్ తెలిపింది. విషయం తనకు తెలియడంతో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి వస్తానని వెళ్లిన ఆనంద్ నాలుగు నెలలైనా రాలేదని బాధితురాలు ఫరీన్ తెలిపింది. తనకు న్యాయం చేయాలని జోగిపేట పోలీసులను ఆశ్రయించినట్టు ఆమె పేర్కొంది.
విచారణ జరుపుతాం: సీఐ
హెడ్‌కానిస్టేబుల్ పాండురాజు ఇంటికి ఆనంద్ తరచూ రావడం వల్ల ఫరీన్‌తో పరిచయం ఏ ర్పడిందని సీఐ తెలిపారు. పాండురాజు.. పీసీ ఆనంద్ వద్ద సుమారు రూ.7 లక్షలు అప్పుగా తీసుకొని ఇవ్వకపోవడంతో గతంలో వీరి పంచాయతీ ఏఎస్పీ వద్దకు వెళ్లిందన్నారు. కిచ్చన్నపల్లిలో ఆనంద్, ఫరీన్‌లను వివాహం జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారంపై లోతుగా పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.