
సాక్షి, హైదరాబాద్: ‘అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల’.. అన్న సామెత పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులకు సరిగ్గా సరిపోయేలా ఉంది. నేరాల నియంత్రణ, టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే నంబర్ వన్ అనిపించుకున్న రాష్ట్ర పోలీస్ శాఖ.. ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకునేలా కనిపిస్తోంది. ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి నడిపిస్తుంటే.. మరోవైపు బాధితులు, నిందితులతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖను కుదిపేస్తోంది.
అదనపు డీసీపీ కొట్టడమేంటి?
షార్ట్ ఫిలిం డైరెక్టర్, అందులో నటించిన యువతి మధ్య వివాదంలో మాదాపూర్ అదనపు డీసీపీ గంగారెడ్డి వ్యవహరించిన తీరు పోలీస్ శాఖ తలపట్టుకునేలా చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదనపు డీసీపీ స్థాయి అధికారి తన్నడం, కొట్టడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. విషయం మీడియాలో ప్రసారమవ్వడంతో డీజీపీ విచారణకు ఆదేశించారు. గంగారెడ్డిని సైబరాబాద్ ఆర్మ్‌డ్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు.
ఈ ఇన్‌స్పెక్టర్ ముందునుంచీ అంతే
రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రావు.. బాధితురాలి ఇంటికెళ్లి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. భర్త హత్య కేసుకు సంబంధించి దివానులో కూర్చొని బాధితురాలు ఫిర్యాదురాస్తుంటే.. ఆయన దివానుకు కాలు పెట్టి దర్జా ప్రదర్శించారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అతన్ని బదిలీ చేసి కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. విచారణకు ఆదేశించారు. గతంలో అబిడ్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసినప్పుడూ మహిళా కానిస్టేబుల్‌తో దురుసు ప్రవర్తన వల్ల ఆయన సస్పెండ్ అయ్యారు.
నేరేళ్ల ఘటనతో ఇరకాటంలో..
సిరిసిల్లా జిల్లా ‘నేరెళ్ల’ఘటనలో దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారం పోలీస్ శాఖను కుదిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రయత్నిస్తుంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అనుభవం లేని అధికారులు చిత్రహింసలకు గురిచేసినట్లు సొంత విభాగం నుంచే విమర్శలొచ్చాయి. ఈ ఘటనలో ఎస్సైపై వేటు వేసినా అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మీడియాపై రుసరుస..
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తులో ఉన్న అప్పటి పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లూ వివాదాస్పదమయ్యారు. ఓ న్యూస్ చానల్ మహిళా రిపోర్టర్‌తో దురుసుగా ప్రవర్తించడంతో జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల ఉస్మానియా వర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి మృతదేహం తరలింపు çసమయంలో ఓ న్యూస్ చానల్ రిపోర్టర్‌ను సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ, ఓయూ ఇన్‌స్పెక్టర్ అశోక్ పోలీస్ జీపెక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లి 3 గంటలు నిర్బంధించారు.
మార్పు రావాల్సిందే..
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చిన డీజీపీ.. అంకితభావ సేవలు, జవాబుదారితనంతో పని చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. వివాదాస్పద ఘటనకు పాల్పడితే ఉపేక్షించేబోనని స్పష్టం చేశారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలా పని చేయాలని, నేరస్థులపై ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు ఫ్రెండ్లీగా విధులు నిర్వహించాలని సూచించారు. అయినా కొంతమంది అధికారులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న తీరు ఉన్నతాధికారులను ఒత్తిడిలోకి నెడుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment