‘కీ’లక పోస్టుల కోసం పోలీస్ క్యూ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సుదీర్ఘకాలం జిల్లాలో పనిచేసి సాధారణ ఎన్నికల పుణ్యమా అని ఇతర జిల్లాలకు బదిలీ అయిన పోలీస్ అధికారులు, జిల్లాలో అప్రాధాన్య పోస్టుల్లో కొనసాగుతున్న మరికొందరు పోలీస్ అధికారులు ‘కీ’లకస్థానాల్లో పాగా వేయటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మారిన రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకొని పోస్టులను చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకోసం రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం జిల్లాలో సీఐ పోస్టులు పెద్దగా ఖాళీగా లేకపోయినప్పటికీ రాజకీయ ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధింవచ్చన్న భావనలో ఉన్నారు. ఈ దిశగా పావులు కదుపుతున్నారు. జిల్లాలో గడువు పూర్తి చేసుకున్న సీఐలకు ఎన్నికలకు ముందే బదిలీలు జరిగాయి. ఒకే స్టేషన్‌లో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీఐలకు మాత్రమే బదిలీ అయ్యే అర్హత ఉంది. అయితే జిల్లాలోని సీనియర్ సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఖమ్మం ట్రాఫిక్, వైరా, కొత్తగూడెం వన్‌టౌన్, పాల్వంచ సీఐ పోస్టులు ఖాళీ అయ్యాయి. రెండునెలలుగా వీటిని భర్తీ చేయటం లేదు. ఖాళీగా ఉన్న ఈ స్థానాలను ఉన్నతాధికారులు అటాచ్‌మెంట్ ఇచ్చారు. కీలకమైన ఈ నాలుగు సీఐ పోస్టులకు భారీస్థాయిలో పైరవీలు నడుస్తున్నాయి. అలాగే ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి వంటి ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం వెంపర్లాడుతున్నారు. అక్కడి అధికార పార్టీ నేతల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు.
జిల్లాలో సుదీర్ఘకాలం ఎస్సైలు, సీఐలుగా పనిచేసిన వారిని అప్పటి ప్రభుత్వం ఎన్నికల నిబంధనల మేరకు బదిలీ చేసింది. జిల్లా నుంచి పెద్దసంఖ్యలో ఎస్సైలు, సీఐలు వరంగల్ జోన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు బదిలీ అయ్యారు. 2009 ఎన్నికలకు ముందులాగే ఈసారి సైతం ఎన్నికలు కాగానే ఎక్కడివారు అక్కడికే వచ్చే అవకాశం ఉంటుందన్న నమ్మకంతో బదిలీ అయినవారంతా తమకు కేటాయించిన స్థానాలకు వెళ్లిపోయారు. ఇదే ప్రాతిపదికన జిల్లా నుంచి బదిలీ అయిన తహశీల్దార్‌లు, ఎంపీడీవోలు తిరిగి తమ పూర్వస్థానాలకు వచ్చేశారు. ఇదే నిబంధనను పోలీసు అధికారులకూ వర్తింపజేయాలని రాజకీయ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
కానీ ఎన్నికలకు ముందు బదిలీ అయిన పోలీసు అధికారులకు ఊహించని దెబ్బ తగిలింది. పోలీస్ ఉన్నతాధికారులు అటాచ్‌మెంట్ జీవో కాకుండా నేరుగా బదిలీ జీవోనే జారీ చేయడం సీఐ, ఎస్సైస్థాయి అధికారులకు సమస్యగా మారింది. గతం నుంచి జిల్లాలో అప్రాధాన్య పోస్టుల్లో పనిచేస్తున్న మరికొందరు సీఐ స్థాయి అధికారులు ఇదే అదనుగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మంచి స్థానాల్లో చేరేందుకు రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు.
ఎన్నికలకు ముందు పరస్పర బదిలీల్లో భాగంగా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి జిల్లాకు వచ్చిన సీఐ, ఎస్సైస్థాయి అధికారుల్లో కొందరు ఇక్కడ ఉండటానికి సుముఖంగా లేరు. రాజకీయ, పాలనా పరిస్థితులు, ఇతరత్ర కారణాల వల్ల వారు తమ పాతస్థానాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే దీర్ఘకాలిక సెలవుల్లో ఉండి వచ్చారు.
తాము గతంలో పనిచేసిన జిల్లాలకు సంబంధించిన టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులను ప్రసన్నం చేసుకొని జిల్లానుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి చెందిన తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరడం తో జిల్లాలో రాజకీయ పరిణామాల్లో మార్పు లు చోటుచేసుకున్నాయి. ఆయనకు త్వరలో మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఐ, ఎస్సై, డీఎస్పీ స్థాయి అధికారులు సైతం ఆయన ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన జలగం వెంకటరావు ను సైతం ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇద్దరు నేతలను నేరుగా కలవకుండా తమకు తెలిసిన..వారికి సన్నిహితంగా ఉండే నేతలతో ఓ మాట చెప్పించుకోవాలని చూస్తున్నారు.
ఇంతచేసినా ప్రభుత్వం పోలీస్ అధికారుల బదిలీపై విధాన పరమైన నిర్ణయం తీసుకునేలా ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తే తప్ప పోలీస్‌బదిలీలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని ఓ పోలీస్ అధికారి వ్యాఖ్యానించటం కొసమెరుపు.