15న పోలీస్‌ మెమోరియల్‌ రన్‌ | Police Memorial Run on 15th | Sakshi
Sakshi News home page

15న పోలీస్‌ మెమోరియల్‌ రన్‌

Published Fri, Sep 29 2017 1:40 AM | Last Updated on Tue, Aug 21 2018 7:46 PM

Police Memorial Run on 15th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని (అక్టోబర్‌ 21) పురస్కరించుకొని అక్టోబర్‌ 15న హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా వద్ద పోలీసుశాఖ ‘మెమోరియల్‌ రన్‌’ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర పోలీసు బలగాల సిబ్బంది, అధికారులతోపాటు ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గురువారం డీజీపీ కార్యాలయంలో ఇండియన్‌ పోలీస్‌ అమరవీరుల మెమోరియల్‌ రన్‌ (ఐపీఎంఎంఆర్‌) వెబ్‌సైట్, ఫేస్‌బుక్, ట్వీటర్‌ ఖాతాలతోపాటు ప్రచార వాహనాలను ప్రారంభించారు. రన్‌లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌    www. policerun. inను డీజీపీ అనురాగ్‌శర్మ, భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ప్రారంభించగా ఫేస్‌బుక్‌ ఖాతా  www. facebook. com/ PoliceRun2017ను హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే ట్వీటర్‌ ఖాతా@ipmmr20172017ను అదనపు డీజీపీ గోపీకృష్ణ ప్రారంభించారు. అనంతరం మెమోరియల్‌ రన్‌కు సంబంధించి అన్ని జిల్లాల్లో ప్రచారం కోసం మూడు వాహనాలను డీజీపీ అనురాగ్‌ శర్మ, మిథాలీరాజ్, కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

మాది పోలీసు కుటుంబమే: మిథాలీరాజ్‌
పోలీసు సిబ్బంది త్యాగాలు, వారి సేవలు తనకు బాగా తెలుసని భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాల్‌రాజ్‌ పేర్కొన్నారు. తన తాత, తండ్రి పోలీసుశాఖలో పనిచేశారని, పోలీసు సిబ్బంది కష్టాలు ఎలా ఉంటాయో తనకు బాగా తెలుసన్నారు. కంటికి రెప్పలా పోలీసులు కల్పిస్తున్న రక్షణ వల్లే తాము దైర్యంగా క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేయగలుగుతున్నామని అభిప్రాయపడ్డారు. మహిళా రక్షణలో రాష్ట్ర పోలీసులు చేపడుతున్న చర్యలు భేష్‌ అని కితాబిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement