పోలీస్ పహారాలో ‘గుట్ట’
దేశ ప్రథమపౌరుడి పర్యటనకు ఏర్పాట్లు
గుట్టకు 6కిలోమీటర్ల పరిధి మేర భారీ బందోబస్తు
యాదగిరిగుట్ట : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతితోపాటు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈ నెల 5న గుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. వీరితోపాటు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ రానున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో గుట్టలో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధిస్తారు. యాదగిరిగుట్ట చుట్టూ 6 కిలోమీటర్ల పరిధిలో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. గుట్ట ప్రధాన రహదారిపై పటిష్టమైన ఆంక్షలను విధించారు. కొండపైకి శనివారం సాయంత్రం నుంచి ఎవరిని అనుమతించరు. రాష్ట్రపతి భద్రతా సిబ్బంది గుట్టను శనివారం మధ్యాహ్నం తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
ట్రాఫిక్ మళ్లింపు..
భువనగిరి మండలం వడాయిగూడెంలో రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలు దిగేందుకు మూడు హెలి ప్యాడ్లు ఏర్పాటు చే శారు. ఈ మూడు హెలిపాడ్‌ల నుంచి గుట్ట పట్టణంలోని ప్రధాన రహదారి, గుండ్లపల్లి, ఘాట్‌రోడ్ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు, వ్యక్తుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచుతారు. గుట్ట నుంచి వం గపల్లి, మల్లా పురం, భువనగిరి వెళ్లే వాహనాలను పట్టణంలోని మసీద్‌రోడ్డు, ఎస్సీ కాలనీరోడ్డు సైదాపురం, మల్లాపురం రోడ్డు నుంచి మళ్లిస్తారు. ఇతర దారుల గుండా వాహనాలను పంపించి, రాష్ట్రపతి వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు.
రాష్ట్రపతి వెళ్లే వరకు ఆంక్షలు
గుట్టకు రాష్ట్రపతి వచ్చినప్పటి నుంచి ఆయన తిరిగి వెళ్లే వరకు పట్టణంలో ప్రధాన రహదారి, కొండపైన పూర్తిస్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయి. ఇక యాదాద్రి కొం డపై, గుట్ట చుట్టుపక్కల ఉన్న కొండలపైన పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచుతారు. ఇప్పటికే భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించి వెళ్లారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా రెండురోజుల నుంచి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్యపూజలు రద్దుచేశారు. అయితే రాష్ట్రపతి పర్యటన రోజే ఆదివారం కానుండడంతో భక్తులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
ఆతిథ్యం కోసం..
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 5న గుట్ట స్వామివారి దర్శనానికి వస్తుండడంతో దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతికి ఆండాళ్ నిలయం అతిథిగృహంలో విడిది, ఇతర ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలు గుట్టకు చేరుకోగానే స్వాగతం పలికేందుకు, వారు పూజలు చేసేందుకు ఏర్పా ట్లు చేశారు. దర్శనం అనంతరం రాష్ట్రపతి తదితరులు ఆండాళ్ నిలయానికి చేరుకుంటారు. ఆయనకు సీఎం కేసీఆర్ గుట్ట అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను, నిర్మాణ డిజైన్లను చూపించి వివరిస్తారు. రాష్ట్రపతికి అంద జేసేందుకు అన్ని రకాల ప్రసాదాలను ప్రత్యేకంగా తయారు చేసేందుకు నిష్ణాతులను రప్పిస్తున్నారు. శుక్రవారం కలెక్టర్ సత్య నారాయణరెడ్డి, ఎస్పీ దుగ్గల్ దేవ స్థానాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈఓ గీతారెడ్డితో మా ట్లాడి ఏర్పాట్లపై సమీక్షించారు.
రాష్ట్రపతి పర్యటన ఖరారు : కలెక్టర్
భువనగిరి : భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ యాదగిరిగుట్ట పర్యటన ఖరారైంది. ఆదివారం ఆయన హైదరాబాద్‌నుంచి యాదగిరిగుట్టకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని తిరిగి వెళతారు. ముందుగా 3వ తేదీనే వస్తారని అందరు భావించినప్పటికీ ఆయన కార్యక్రమం 5వతేదీన ఖరారు అయ్యింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమ షెడ్యూల్‌ను శుక్రవారం కలెక్టర్ సత్యనారాయణరెడ్డి వివరించారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు బొల్లారం ఈఎంఐ హెలిపాడ్ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎంఐ 8/17 విమానంలో బయలు దేరి 11.10 గంటలకు యాదగిరిగుట్ట సమీపంలోని వడాయిగూడెం హెలిపాడ్ వద్ద దిగుతారు.
11.30 గంటలకు గుట్టపైన గల రాష్ట్రప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారు. 11.45వరకు అక్కడే ఉండి 11.50 గంటలకు శ్రీ లక్ష్మినరసింహస్వామి వారి గర్భాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 12.20 వరకు అంటే అరగంట పాటు ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనం, , వేదపండితుల చేత అభిషేకం చేయిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.25 గంటలకు అతిథిగృహంలోకి వెళ్లి మధ్యాహ్నం12.40గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 12.50గంటలకు హెలిపాడ్ వద్దకు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు యాదగిరిగుట్ట నుంచి విమానంలో బయలు దేరి వెళతారు.