yadhagirigutta
-
సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన (ఫొటోలు)
-
ముగిసిన సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన
సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ముగిసింది. యాదాద్రి సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వామి వారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన క్రతువులో పాల్గొన్నారు. మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజలు చేశారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా ఉద్ఘాటన క్రతువును నిర్వహించారు. అనంతరం యాదాద్రి నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు చేరుకున్నారు. ► పూజా కార్యక్రమాలు ముగించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు శివాలయం నుంచి బయటకు వచ్చారు. సీఎం కేసీఆర్ దంపతులు ప్రెసిడెన్సియల్ సూట్లో మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ► అనుబంధ ఆలయమైన పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామీ ఆలయ ఉద్ఘాటన క్రతువులో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మిదిగా ఉద్ఘాటన పర్వాలు జరుగుతున్నాయి. ► యాదాద్రి ప్రధానాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహా కుంభాభిషేకంలో పాల్గొననున్నారు. ► మరికాసేపట్లో యాదాద్రి గుట్టపైన శివాలయంలో నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతి, మహా కుంభాభిషకం పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు. ► ఎర్రవెళ్లి ఫాంహౌస్ నుంచి యాదాద్రికి బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదగిరిగుట్టకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన యాదాద్రి కొండపైకి చేరుకోనున్నారు. సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ యాదాద్రి కొండపైగల శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభాభిషేకం, స్పటిక లింగ ప్రతిష్ట కార్యక్రమాలకు సోమవారం హాజరుకానున్నారు. కొండపైన గల శివాలయంలో ఈనెల 20 నుంచి మహా కుంభాభిషేకం ఉత్సవాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామీజీ ఆ«ధ్వర్యంలో ఈ ఉద్ఘాటన కార్యక్రమం జరగనుంది. సీఎంతో పాటు దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొననున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తి కావడంతో గత నెల 28న లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన, మహా కుంభాభిషేకంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న సంగతి తెలిసిందే. లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నూతనంగా నిర్మించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మార్చి 4న యాదాద్రికి అఖండ జ్యోతి
యాదగిరిగుట్ట/భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మార్చి 4న స్వామివారి అఖండజ్యోతి యాదగిరిగుట్టకు రానున్నట్లు అఖండ జ్యోతి యాత్ర చైర్మన్ ఎం.ఎస్.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి అఖండజ్యోతి ఉత్సవ విగ్రహాలు హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గణేశ్ అనే కళాకారుడు తయారు చేస్తున్నారని చెప్పారు. ఈనెల 28న సాయంత్రం అఖండ జ్యోతి పూజ జరుగుతుందని, అదే రోజు రాత్రి బర్కత్‌పురాలోని యాదగిరి భవన్‌కు యాత్ర చేరుకుంటుందని వెల్లడించారు. మార్చి 1న ఉదయం 10 గంటలకు బర్కత్‌పురా చౌరస్తాలోని యాదగిరి భవన్ నుంచి అఖండజ్యోతి యాత్ర ప్రారంభమై అదే రోజు రాత్రి ఉప్పల్ చౌరస్తాకు చేరుకుంటుందని తెలిపారు. 2న ఉప్పల్ నుంచి బయల్దేరి రాత్రి ఘట్కేసర్ కేఎల్ఆర్ గార్డెన్‌కు, 3న ఉదయం ఘట్కేసర్ నుంచి బయల్దేరి రాత్రి భువనగిరిలోని నల్లగొండ క్రాస్‌రోడ్‌కు వస్తుందన్నారు. అక్కడ రాత్రి బస చేసి 4న ఉదయం భువనగిరి నుంచి బయల్దేరి రాత్రి యాదగిరిగుట్ట చేరుకుంటుందని వివరించారు. యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులకు అఖండ జ్యోతిని అప్పగిస్తామని పేర్కొన్నారు. -
ముగిసిన సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన
సాక్షి, యాదాద్రి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన ముగిసింది. పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలు దేరారు. కాగా వచ్చే నెల 21 నుంచి 28 వరకు జరగనున్న యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పనులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రిని సందర్శనకు వచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్.. యాదాద్రికి చేరుకున్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న కేసీఆర్.. ఆపై ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని ఏరియల్ వ్యూ ద్వారా సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా.. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆలయ పండితులు, అధికారులతో కేసీఆర్ సమీక్షించి, పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. తుది దశకు చేరిన పనులు... ఆలయ ప్రాంగణంతోపాటు టెంపుల్ సిటీ, కాటేజీల నిర్మాణాలు, విద్యుదీకరణ, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, అన్నప్రసాదం, వ్రత మండపం, గండి చెరువు సుందరీకరణ, బస్ టెర్మినళ్ల వంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రధానాలయంలో పరంజాలు కడుతుండగా బస్‌బేలు, సత్యనారాయణ వ్రత మండపం, అన్నదాన కేంద్రానికి శ్లాబులను ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరిణి, దీక్షాపరుల మండపం పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రధానాలయానికి స్వాగత తోరణం, ఫ్లైఓవర్ల పనులు జరుగుతున్నాయి. మెట్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. -
యాదాద్రికి ఎంఎంటీఎస్ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సువర్ణ యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మిక నగరంగా, అందమైన, ఆహ్లాదభరితమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా పనులు కొనసాగిస్తోంది. కానీ ఇక్కడికి రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రతిష్టాత్మకమైన ఎంఎంటీఎస్ ప్రాజెక్టులో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. యాదాద్రి పునర్మిర్మాణ పనులను ప్రారంభించడానికి ముందే ప్రభుత్వం ఈ మార్గంలో రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులు కోసం ఎంఎంటీఎస్ రైల్వే నెట్‌వర్క్‌ను యాదాద్రి సమీపంలోని రాయగిరి వరకు విస్తరించాలని ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రణాళికలను సైతం రూపొందించింది. కానీ నాలుగేళ్లుగా యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు కాగితాల్లో ఉండిపోయింది. టెండర్లకే పరిమితం.. యాదాద్రికి రోడ్డు రవాణా మార్గంతో పాటు రైల్వే సదుపాయం కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో రైల్వేబోర్డు అప్పటికప్పుడు సర్వేలు పూర్తి చేసి ప్రాజెక్టు అంచనాలను రూపొందించింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశలో భాగంగా ఘట్కేసర్ వరకు పనులు పూర్తి చేశారు. ఇక్కడి నుంచి నుంచి రాయగిరి 33 కిలోమీటర్ల మార్గాన్ని డబ్లింగ్ చేసి విద్యుదీకరించేందుకు ఎంఎంటీఎస్ రెండో దశలోనే భాగంగా రూ.330 కోట్ల వరకు అంచనాలు వేశారు. 2016లో ఈ ప్రతిపాదనలు సిద్దం చేసినప్పటికీ 2018 వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటికే ప్రాజెక్టు వ్యయం రూ.414 కోట్లకు చేరుకుంది. ఇదే ఏడాది దక్షిణమధ్య టెండర్లను ఆహ్వానించింది. కొన్ని నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. భూమి, ఇతర వనరులతో పాటు, ప్రాజెక్టు వ్యయంలో 59 శాతం రాష్ట్రం ఇవ్వాల్సి ఉంది. మిగతా 41 శాతాన్ని రైల్వే శాఖ భరిస్తుంది. పెరిగిన అంచనా వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి కోసం దక్షిణమధ్య రైల్వే ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ 2019 వరకూ సమ్మతి లభించకపోవడంతో టెండర్లు రద్దయ్యాయి. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి సమ్మతి లభించినప్పటికీ ద.మ రైల్వే ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోసారి ఏ ప్రాతిపదికపై టెండర్లను ఆహ్వానించాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.50 కోట్లు కేటాయించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని అందజేస్తే ముందుకు వెళ్లవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుబాటులోకి వస్తే.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, మౌలాలీ, చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా నేరుగా రాయగిరి వరకు వెళ్లవచ్చు. ప్రయాణికులు ఇప్పుడు చెల్లిస్తున్న రవాణా చార్జీలు సైతం సగానికి పైగా తగ్గుతాయి. నగరంలో ప్రస్తుతం ఎంఎంటీఎస్ చార్జీలు కనిష్టంగా రూ.5 నుంచి రూ.15 వరకు ఉన్నాయి. భవిష్యత్తులో చార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు భావించినా రూ.25 నుంచి రూ.30 లోపే రాయగిరి వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో 5 కి.మీ రోడ్డు మార్గంలో వెళ్లాల్సిఉంటుంది. ఈ రూట్లో రైల్వే సదుపాయాలు విస్తరించడం వల్ల రియల్ఎస్టేట్ రంగంతో పాటు వ్యాపార కార్యకలాపాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
తెలంగాణ సర్కార్‌కు రాజాసింగ్ వార్నింగ్
సాక్షి, యాదాద్రి: ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలను చెక్కడం వివాదంగా మారుతోంది. ఆలయ స్తంభానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో పిల్లర్‌కు సీఎం కేసీఆర్ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపు అష్టభుజి ప్రాకార మండపంలో కారుగుర్తు, కేసీఆర్ కిట్టు, తెలంగాణ లోగోలో చార్మినార్‌ను అమర్చినట్లు చెక్కారు. వీటిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్థానిక బీజేపీ నేతలతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి స్తంభాలపై చెక్కిన కేసీఆర్, కారు బొమ్మలను తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజులు టైం ఇస్తున్నామని హెచ్చరించారు. వారంలోపు తొలగించకపోతే దేశంలో ఉన్న హిందూవాదులందరితో కలిసి ఆందోళనకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని ప్రపంచస్థాయి క్షేత్రంగా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ఆయన బొమ్మలను వేయడం సరికాదన్నారు. రాష్ట్ర నాయకత్వంతో చర్చించి త్వరలోనే యాదాద్రిపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. భావితరాలకు తెలియజేయడానికి నాయకుల బొమ్మలను చెక్కితే, వారు చేసిన అవినీతిని కూడా చెక్కుతారా.? అని నిలదీశారు. కాగా రాజాసింగ్ రాక సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. మరోవైపు యాదాద్రి కొండపైన సీఎం కేసీఆర్, కారుగుర్తు, కేసీఆర్ కిట్టు, హరితహారం వంటి చిత్రాలను ఆలయంలో పిల్లర్లపై చెక్కడంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ భజరంగ్‌దళ్, హిందుపరిరక్షణ సమితి, విశ్వహిందు పరిషత్, హిందుత్వ వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికితోడు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబుl
సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రాహుల్‌గాంధీ ఎంపిక చేయడం లేదని, చంద్రబాబు నాయుడే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, రచనలు చేస్తున్నారని మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. మహాకూటమి రూపంలో మొండి చెయ్యితో కాంగ్రెస్ పార్టీ.. ప్రజల చెవ్వుల పువ్వులు పెట్టడానికి బీజేపీ పార్టీ.. అగ్గిపెట్టె గుర్తుతో పుల్లలు పెట్టడానికి కోదండరాం పార్టీలు వస్తున్నాయని విమర్శించారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు.. ముసలి నక్క.. గుంట నక్కలు ఏకమై మాయల కూటమి రూపంలో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నాయని మండిపడ్డారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని యాదగిరిపల్లిలో నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘నోట్ల కట్టలకు ఆశపడి ఇజ్జత్ తక్కువ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో దోస్తీ కట్టి ఇక్కడి రైతాంగాన్ని నాశనం చేయడానికి వస్తున్నారు. కానీ, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లు వేసి కర్రు కాల్చి వాతలు పెడతారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు.. నోట్ల కోసం చంద్రబాబుకు దాసోç ßæం అవుతున్నారు’అని మంత్రి విమర్శించారు. సబ్బండ వర్గాలను కారులో ఎక్కించుకుని నడుపుతు న్న డ్రైవర్ మారొద్దు.. కారు ఆగొద్దు..ప్రగతి రథచక్రం ముందుకు సాగాలంటే 100 సీట్లు గెలిపించుకోవాలన్నారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ముఖంలో చిరునవ్వు వచ్చిందని, ఆ చిరునవ్వు అలాగే కొనసాగాలంటే మరోసారి టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలన్నారు. నేనొస్తా సర్కార్ దవాఖానకు.. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే పేద ప్రజలు ‘నేను రానామ్మో సర్కార్ దవాఖానాకు’అన్న మాటలకు నేడు ‘నేనొస్తా అమ్మా సర్కార్ దవాఖానాకు’అనే నినాదంకు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కేటీఆర్ అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ తిరుపతికి ధీటుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు 30 ఉత్తరాలను కేంద్రానికి పంపారన్నారు. ఈ సభలో భువనగిరి, నల్లగొండ లోక్‌సభ సభ్యులు డాక్టర్ బూరనర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యు లు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నెప్రభాకర్, మందుల సామేల్, గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజలకు విముక్తి కల్పించాలనే సంకల్పయాత్ర...
యాదగిరిగుట్ట : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రాక్షసపాలన.. తెలంగాణలో కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న బాధలకు విముక్తి కలగాలని నృసింహుడిని కోరుకున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతం చేయాలని, 29న సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అవుతున్న సందర్భంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 25న హైదరాబాద్‌లో చేపట్టిన పాదయాత్ర యాదగిరిగుట్టకు శుక్రవారం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్రెడ్డి సంకల్పయాత్ర నిర్ణయం తీసుకున్నారంటే.. అక్కడ చంద్రబాబు పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నారన్నారు. 40నెలల పాలనలో సీఎం కేసీఆర్ మాటల గారడీతో ప్రజల మభ్యపెడుతున్నారని, చంద్రబాబు నాయుడు ఆకాశానికి అందని హామీలు ఇస్తూ ప్రజలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. కేసీఆర్‌ది మాటల గారడీ తప్ప.. ముఖ్యమంత్రిగా ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయాల్లో పొంతనలేకుండా పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, భగవంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వడ్లోజు వెంకటేశ్‌లు మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ«శయాలను సాధించే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే నాయకుడిగా, ప్రజల సంక్షేమం కోసం ఉద్యమాలు చేసే నేతగా వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. పాదయాత్రకు ఘన స్వాగతం... పార్టీ ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి రాఘవరెడ్డి చేపట్టిన పాదయాత్రకు యాదగిరిగుట్టలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వడ్లోజు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం ఫలికారు. కళాకారుల ఆటపాటలు, బాణసంచాల కాల్చుతూ యాదగిరిగుట్ట శివారులో గుండ్లపల్లి నుంచి శ్రీరాంనగర్‌కు చేరుకుని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ పూలే విగ్రహాలకు పూల మాల వేసి, బస్టాండ్, పాతగుట్ట చౌరస్త మీదుగా వైకుంఠ ద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం జగన్మోహన్రెడ్డి పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు మందడపు వెంకట్రాంరెడ్డి, విజయ ప్రసాద్, చెరుకు శ్రీనివాస్, సీఈసీ సభ్యుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుమ్మ అప్పిరెడ్డి, సేవదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆజాద్, ఆయా జిల్లాల అధ్యక్షుడు నాడం శాంత కుమార్, వడ్లోజు వెంకటేష్, భగవంత్‌రెడ్డి, రవీందర్, నరేందర్‌రెడ్డి, బీవీ మోహన్, రాఘవరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, అప్పం కిషన్, బాన్సువాడ కో ఆర్డినేటర్ రామ్మోహన్, కల్వకొలను సతీష్‌రాజ్, విజయ్‌ప్రసాద్, సుమన్‌గౌడ్, ముదిగొండ శ్రీకాంత్, గోవర్ధన్‌రెడ్డి, వేణుప్రసాద్ గౌడ్, అకిలేష్గౌడ్,రవీందర్‌గౌడ్, మాదగోని జంగయ్యగౌడ్, హరికృష్ణ తదితరులున్నారు. -
పోలీస్ పహారాలో ‘గుట్ట’
దేశ ప్రథమపౌరుడి పర్యటనకు ఏర్పాట్లు గుట్టకు 6కిలోమీటర్ల పరిధి మేర భారీ బందోబస్తు యాదగిరిగుట్ట : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతితోపాటు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈ నెల 5న గుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. వీరితోపాటు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ రానున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో గుట్టలో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధిస్తారు. యాదగిరిగుట్ట చుట్టూ 6 కిలోమీటర్ల పరిధిలో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. గుట్ట ప్రధాన రహదారిపై పటిష్టమైన ఆంక్షలను విధించారు. కొండపైకి శనివారం సాయంత్రం నుంచి ఎవరిని అనుమతించరు. రాష్ట్రపతి భద్రతా సిబ్బంది గుట్టను శనివారం మధ్యాహ్నం తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ట్రాఫిక్ మళ్లింపు.. భువనగిరి మండలం వడాయిగూడెంలో రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలు దిగేందుకు మూడు హెలి ప్యాడ్లు ఏర్పాటు చే శారు. ఈ మూడు హెలిపాడ్ల నుంచి గుట్ట పట్టణంలోని ప్రధాన రహదారి, గుండ్లపల్లి, ఘాట్‌రోడ్ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు, వ్యక్తుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచుతారు. గుట్ట నుంచి వం గపల్లి, మల్లా పురం, భువనగిరి వెళ్లే వాహనాలను పట్టణంలోని మసీద్రోడ్డు, ఎస్సీ కాలనీరోడ్డు సైదాపురం, మల్లాపురం రోడ్డు నుంచి మళ్లిస్తారు. ఇతర దారుల గుండా వాహనాలను పంపించి, రాష్ట్రపతి వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు. రాష్ట్రపతి వెళ్లే వరకు ఆంక్షలు గుట్టకు రాష్ట్రపతి వచ్చినప్పటి నుంచి ఆయన తిరిగి వెళ్లే వరకు పట్టణంలో ప్రధాన రహదారి, కొండపైన పూర్తిస్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయి. ఇక యాదాద్రి కొం డపై, గుట్ట చుట్టుపక్కల ఉన్న కొండలపైన పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచుతారు. ఇప్పటికే భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించి వెళ్లారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా రెండురోజుల నుంచి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్యపూజలు రద్దుచేశారు. అయితే రాష్ట్రపతి పర్యటన రోజే ఆదివారం కానుండడంతో భక్తులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఆతిథ్యం కోసం.. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 5న గుట్ట స్వామివారి దర్శనానికి వస్తుండడంతో దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతికి ఆండాళ్ నిలయం అతిథిగృహంలో విడిది, ఇతర ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలు గుట్టకు చేరుకోగానే స్వాగతం పలికేందుకు, వారు పూజలు చేసేందుకు ఏర్పా ట్లు చేశారు. దర్శనం అనంతరం రాష్ట్రపతి తదితరులు ఆండాళ్ నిలయానికి చేరుకుంటారు. ఆయనకు సీఎం కేసీఆర్ గుట్ట అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను, నిర్మాణ డిజైన్లను చూపించి వివరిస్తారు. రాష్ట్రపతికి అంద జేసేందుకు అన్ని రకాల ప్రసాదాలను ప్రత్యేకంగా తయారు చేసేందుకు నిష్ణాతులను రప్పిస్తున్నారు. శుక్రవారం కలెక్టర్ సత్య నారాయణరెడ్డి, ఎస్పీ దుగ్గల్ దేవ స్థానాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈఓ గీతారెడ్డితో మా ట్లాడి ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటన ఖరారు : కలెక్టర్ భువనగిరి : భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ యాదగిరిగుట్ట పర్యటన ఖరారైంది. ఆదివారం ఆయన హైదరాబాద్‌నుంచి యాదగిరిగుట్టకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని తిరిగి వెళతారు. ముందుగా 3వ తేదీనే వస్తారని అందరు భావించినప్పటికీ ఆయన కార్యక్రమం 5వతేదీన ఖరారు అయ్యింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమ షెడ్యూల్‌ను శుక్రవారం కలెక్టర్ సత్యనారాయణరెడ్డి వివరించారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు బొల్లారం ఈఎంఐ హెలిపాడ్ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎంఐ 8/17 విమానంలో బయలు దేరి 11.10 గంటలకు యాదగిరిగుట్ట సమీపంలోని వడాయిగూడెం హెలిపాడ్ వద్ద దిగుతారు. 11.30 గంటలకు గుట్టపైన గల రాష్ట్రప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారు. 11.45వరకు అక్కడే ఉండి 11.50 గంటలకు శ్రీ లక్ష్మినరసింహస్వామి వారి గర్భాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 12.20 వరకు అంటే అరగంట పాటు ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనం, , వేదపండితుల చేత అభిషేకం చేయిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.25 గంటలకు అతిథిగృహంలోకి వెళ్లి మధ్యాహ్నం12.40గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 12.50గంటలకు హెలిపాడ్ వద్దకు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు యాదగిరిగుట్ట నుంచి విమానంలో బయలు దేరి వెళతారు. -
నారసింహా.. ఇదేమి లడ్డూ!
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దివ్యప్రసాదమైన లడ్డూ, పులిహోర నాణ్యత రోజురోజుకూ కోల్పోతుంది. లడ్డూల్లోనుంచి నీరు గారుతోంది, పులిహోర.. దద్దోజనం మాదిరిగా ముద్దగా ఉంటోంది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల తయారీలో దేవస్థానం అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొన్ని రోజలుగా లడ్డూ, పులిహోర ప్రసాదాల నాణ్యతను అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పులిహోర, లడ్డూలు పచ్చి ముద్దలుగా ఉండి అందులోనుంచి నీరు కారుతోంది. నాణ్యత లోపాలను సంబంధిత దేవస్థానం అధికారుల దృష్టికి వచ్చినా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు పద్ధతిపై లడ్డూల తయారీ.. యాదగిరిగుట్టలో లడ్డూ ప్రసాదాలను రెండు రకాలుగా తయారు చేస్తున్నారు. 50 రూపాయల లడ్డూ పెద్దది. దీనిని అభిషేకం లడ్డూ అంటారు. దీనిని 400 గ్రాములుగా తయారు చేస్తున్నారు. 10 రూపాయల లడ్డూ 100గ్రాములుగా తయారు చేస్తున్నారు. వీటిని ప్రతిసారీ కాంట్రాక్టు పద్ధతిన దేవస్థానం తయారు చేస్తుంది. ఈ కాంట్రాక్టు పద్ధతి ఆరేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. అయితే కాంట్రాక్టర్లు ప్రసాదాల తయారీని వ్యాపారంగా మార్చేశారు. భక్తులకు పవిత్రంగా అందించే ప్రసాదంగా చూడడం లేదనేది ప్రధాన ఆరోపణ. కాంట్రాక్టుదారులు 10కిలోల దిట్టంలో 105 లడ్డూలను తయారు చేయాలనేది నిబంధన. కానీ కక్కుర్తి పడి కిలో దిట్టంలో నీటిశాతం ఎక్కువగా చేసి 130 లడ్డూలను త యారుచేసి అక్రమ ఆదాయానికి తెర తీస్తున్నారు. కిలో దిట్టంలో చిన్న లడ్డూలను 42 తయారు చేయాలి. కానీ 60 చిన్న లడ్డూలను తయారుచేస్తున్నారు. దీంతో ఈ లడ్డూలు పచ్చి ముద్దలుగా ఉండి చేతిలో పట్టుకుంటే అందులోనుంచి నీరు పానకంలాగా కారుతుంది. కాంట్రాక్టర్లు భక్తులకు నాణ్యత లేని లడ్డూలను తయారు చేస్తున్నా దేవస్థానం అధికారులు పట్టించుకోకపోగా సదరు కాంట్రాక్టరుకు తమదైన శైలిలో సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది తక్కువ.. లడ్డూల తయారీ కోసం 35మంది సిబ్బందిని నియమించాలి. కానీ ఇక్కడ కాంట్రాక్టు షెడ్యూల్లో ఉన్న దానికంటే 15మంది తక్కువా ఉన్నారు. 100 గ్రాముల లడ్డూ తయారీదారులు 20మంది, 400 గ్రాముల లడ్డూలను 15 మందితో తయారు చేయాలని నిబంధన విధించింది. అయినా కాంట్రాక్టుదారుల కక్కుర్తి బుద్ధితో కేవలం 20 మందితోనే తయారు చేస్తుండడంతో రద్దీ రోజులలో భక్తులకు పూర్తిస్థాయిలో ప్రసాదాలు అందడం లేదు. పచ్చి లడ్డూల తయారీ 50 రూపాయల 400 గ్రాముల లడ్డూలను దేవస్థానం పచ్చివాటిని అమ్ముతుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ లడ్డూలు దద్దోజనం మాదిరిగా ఉంటున్నాయని వారంటున్నారు. అంతేగాక ప్రతిసారీ 50 రూపాయల లడ్డూలను స్వామి, అమ్మవారి చిత్ర పటాలు గల అందమైన డబ్బాలలో పెట్టి అమ్మేవారు. కానీ వారం రోజులుగా డబ్బాలు స్టాక్ అయిపోవడంతో కవర్లలో ఉంచి ఇస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లడ్డూలను తయారీదారులు నీటిని ఇష్టమొచ్చిన రీతిలో పోసి తయారు చేస్తున్నారని, దీంతో పచ్చిముద్దగా ఉంటాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూల దిట్టం ఇలా.. కిలో దిట్టానికి కిలో శనగ పిండి, 2 కిలోల చక్కెర, 600 గ్రాముల నెయ్యి, 75 గ్రాముల కాజు, 50గ్రాములు కిస్మిస్, 10గ్రాముల ఇలాచి పొడి సామగ్రిని దేవస్థానం..సదరు కాంట్రాక్టర్‌కు ఇస్తుంది. వారు అదనపు ఆదాయం కోసం దిట్టంలోని వస్తువులను తక్కువగా వాడి నాణ్యత లేని ఎక్కువ లడ్డూలను తయారు చేస్తున్నారు. కిలో దిట్టానికి పెద్దలడ్డూల తయారీకి రూ.12.50, చిన్న లడ్డూలకు రూ.11.50 కాంట్రాక్టర్‌కు చెల్లిస్తుంది. ఇటు వస్తువులు తక్కువగా వాడడం..అటు ఇచ్చిన వస్తువులతో ఎక్కువగా తయారు చేసి కాంట్రాక్టర్ రెండు రకాలుగా ఆదాయం పొందుతున్నాడు. నిద్రపోతున్న నిఘా వ్యవస్థ దేవస్థానంలోని ప్రసాదాల తయారీ విభాగంలో నిఘా నిద్రపోతుందన్న విమర్శలున్నాయి. రెండేళ్ల క్రితం ల డ్డూ తయారీ విభాగంలో, ప్రసాదాల కౌంటర్ వద్ద రెం డు కెమెరాలను అమర్చారు. తయారీ విభాగంలోని కె మెరా పనిచేయడం లేదు. దీంతో తయారీదారులు ఇ ష్టానుసారంగా నీటిశాతం ఎక్కువ చేసి లడ్డూప్రసాదాలను తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. కెమెరాల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఈఓ కూడా పట్టించుకోవడం లేదు. ప్రసాదాల విక్రయ కౌంటర్లు రెండు ఉండగా ఒకే కెమెరా ఉంది. ఒక్క కౌం టర్ పనితీరును మాత్రమే ఈ కెమెరా తెలుపుతుంది. -
పాతగుట్టకు బ్రహ్మోత్సవ శోభ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధీనంలోని పాతగుట్ట.. బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఆలయాన్నిరంగులు, విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. - న్యూస్‌లైన్, యాదగిరికొండ పాతగుట్ట బ్రహ్మోత్సవాలకు దేవస్థానం అధికారులు నాలుగు రోజులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 3000 కరపత్రాలు ముద్రించి దాతలకు పంపిణీ చేశారు. 3000 వాల్ పోస్టర్లు ముద్రించి సుదూర ప్రాంతాలకు పంపించారు. ఆలయానికి, విష్ణు పుష్కరిణికి వెళ్లే దారిలోని మెట్లకు సున్నం, రంగులు, జాజు వేశారు. తాత్కాలికంగా చలువ పందిళ్లు వేయడమేగాక మంచినీటి సౌకర్యం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి కల్యాణం నిర్వహించనున్న స్థలాన్ని చదును చేసి చుట్టూ ప్రహరీ నిర్మించారు. 50వేల లడ్డూ ప్రసాదం సిద్ధం సుమారు 50 వేల లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు సుమారు 20,000 మంది భక్తులు హాజరుకానున్నట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. కల్యాణం, రథోత్సవం నిర్వహించే రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసుల సహకారంతో తగిన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వినోదం కలిగించేందుకు గాను తగిన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా భరత నాట్యం, హరికథా కాలక్షేపం, బుర్రకథ, చిందు, యక్షగానం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో పారాయణాలు , హోమాలు , జపాలు చేసేందుకు గాను సుమారు 10 మంది అర్చకులను ప్రత్యేకంగా పిలిపిస్తున్నారు. ఆంజనేయస్వామికి కిలోన్నర వెండి కవచం బహూకరణ పాతగుట్టలోని గర్భాలయంలో గల ఆంజనేయ స్వామి వారికి కిలోన్నర వెండితో చేయించిన కవచాన్ని హైదరాబాద్‌లోని రామంతాపూరర్కు చెందిన జైపాల్‌రెడ్డి అనే భక్తుడు దేవస్థానం అధికారులకు బహూకరించారు. ఈ సందర్భంగా ఆ కవచాన్ని ఆంజనేయస్వామికి అలంకరించి ఆకుపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సంపతాచార్యులు, గట్టు వెంకటాచార్యులు, రాజమన్నార్, ఆలయ అధికారులు అశోక్ , గడసంతల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అధ్యయనోత్సవాల్లో జరిగే కార్యక్రమాలు పాతగుట్టలో బ్రహ్మోత్సవాలను పురస్కరిం చుకుని బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. వీటి నిర్వహణ కోసం ఆరుగురు అర్చకులను పిలిపిస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు తిరమంజనసేవ, రాత్రి 7గంటలకు తోళక్కం, 6 వ తేదీ ఉదయం 9గంటలకు తిరుమంజన సేవ, రాత్రి 7గంటల నుంచి దివ్యప్రబంధ సేవాకాలం 7 వ తేదీ ఉదయం తిరుమంజన సేవ, రాత్రి పరమ పద ఉత్సవం 8 వ తేదీ ఉదయం 8 గంటలకు చాత్మరతో అధ్యయనోత్సవాలు ముగుస్తాయి. -
భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి
యాదగిరికొండ, న్యూస్‌లైన్ : దేవస్థానాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సిబ్బం దిపై ఉందని లేబర్ కమిషనర్ రమణాచారి అన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వేముల వాడ, భద్రాచలం, శ్రీశైలం లాం టి దేవాలయాలను శానిటేషన్‌పై మోడల్‌గా తీసుకున్నట్టు పేర్కొన్నారు. గుట్ట దేవస్థానంలో శాని టేషన్ మంచిగా ఉన్నది లేనిది దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్టు తెలిపారు. క్షేత్రాలకు వచ్చే ప్రతి భక్తునికి పరిసరాల పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు దేవస్థానం ఈఓ కృష్ణవేణితో ఆయన సుమారు 3 గంటల పాటు చర్చించారు. సిబ్బందితో కలిసి ఆయన ఆలయ సరిసరాలు, సంగీత భవనం, గర్భాలయం, ఆండాళ్ నిలయం, విష్ణు పుష్కరిణి, తదితర ప్రాంతాల ఫొటోలను తీసుకున్నారు. దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లు విక్రయించకూడదని సూచించారు. ఆయనతోపాటు దేవస్థానం సిబ్బంది దోర్భల భాస్కర శర్మ, ఆంజనేయులు, సివిల్ అధికారులు మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సంద్ర మల్లేష్ ఉన్నారు. -
యాదగిరీశుడికి ప్రముఖుల పూజలు
యాదగిరికొండ, న్యూస్‌లైన్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో శనివారం కేరళ హైకోర్టు న్యాయమూర్తి చిందంబరేషన్, రాష్ట్ర డీఐజీ నవీన్‌చంద్రలు స్వామి, అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు గర్భాలయ ముఖద్వారం వద ్దపూలమాలలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈఓ కృష్ణవేణి వారికి స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సత్తయ్య, ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, ఆలయ అధికారులు దోర్భల భాస్కర శర్మ, ఆంజనేయులు, జూశెట్టి కృష్ణ, రామారావు నాయక్ పాల్గొన్నారు. కుటుంబ కథా చిత్రాలే మంచి పేరు తెచ్చి పెట్టాయి కుటుంబ కథా చిత్రాలే తనకు మంచి పేరు తెచ్చి పెట్టాయని సినీనటి శిరీష అన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఆమె స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడున్న హీరోలతో అక్క, చెల్లి, వదిన పాత్రలలో నటించానని పేర్కొన్నారు. సుమారు 35 సినిమాలలో నటించినట్టు చెప్పారు. మనసంతా నువ్వే, స్టూడెంట్ నంబర్ వన్, పల్లకిలో పెళ్లి కూతురు లాంటి సినిమాలు చేశానని తెలిపారు. తాను నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం కుటుంబ కథా చిత్రాలేనని పేర్కొన్నారు. జైనాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి ఆలేరు : కొలనుపాక జైన దేవాలయాన్ని కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చిద ంబరేశన్ సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు జరిపారు. అంతకుముందు ఆయనకు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. జైనదేవాలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. -
‘కొండ’ దిగనున్న కష్టాలు
భువనగిరి, న్యూస్‌లైన్: ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న యాదగిరిగుట్ట రెండో ఘాట్ రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.26.6 కోట్లను మంజూరు చేసింది. సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఘాట్‌రోడ్డు పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభం కానున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు వచ్చిపోతుంటారు. ఒక్కోరోజు భక్తుల సంఖ్య లక్ష వరకు ఉంటుంది. భక్తులు కొండపైకి చేరుకోవడానికి మూడు మెట్ల మార్గాలు, ఒక ఘాట్‌రోడ్డు మార్గం ఉంది. నృసింహ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఒక మెట్ల మార్గాన్ని అధికారులు మూసివేశారు. రోజురోజుకూ భక్తుల రద్దీతో పాటు వాహనాలు, ఆటోలు, ద్విచక్రవాహనాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో పాటు సెలవు రోజులు, పుణ్య దినాలు, ప్రత్యేక రోజుల్లో భక్తుల రద్దీని తట్టుకోవడానికి ప్రధానంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నా ట్రాఫిక్ సమస్య తలనొప్పిగా మారింది. పోలీసులకు, అధికార యంత్రాంగానికి, భక్తులకు ఇబ్బందులు సృష్టిస్తున్న ఘాట్ రోడ్డు సమస్య పరిష్కారానికి ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. డబుల్ రోడ్డుగా.. కొండపైకి ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చనున్నారు. దీన్ని కొండపై నుంచి భక్తులు కిందికి రావడానికి ఉపయోగిస్తారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం రెడ్డి సత్రం వద్ద జంక్షన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 100 మీటర్ల ఘాట్ రోడ్డును కొండ వెనక భాగం నుంచి నిర్మిస్తారు. దీనిని అలా పున్నమి గెస్ట్‌హౌస్ పక్కగా ఏర్పాటు చేసి ప్రస్తు తం ఉన్న రోడ్డుకు కలుపుతారు. అదే విధంగా ఆలేరు వైపు నుంచి వచ్చే భక్తుల కోసం యాదగిరిపల్లి గోశాల ద్వారా అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేస్తారు. ఇది హరిత భవన్ నుంచి రెండవ కమాన్ వద్ద రెండవ ఘాట్‌రోడ్డు కొండపైన కలుస్తుంది. దీని పొడవు సుమారు 1.2 కిలోమీటర్లు ఉంటుంది. కొండ వెనక భాగంలో స్వాగత తోరణం వద్ద విశాలమైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం రోడ్డును డబుల్‌రోడ్డుగా ఏర్పాటు చేస్తారు. మెట్ల దారి పాదాల వద్ద మరో జంక్షన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూస్తారు. త్వరలో పనులు ప్రారంభం : వసంత, ఆర్అండ్బీ ఈఈ రెండవ ఘాట్‌రోడ్డు పనులకు త్వరలో టెండర్లు పిలుస్తాం. 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఇందుకోసం కసరత్తు చేస్తున్నాం. ప్రత్యేక దినాల్లో కొండపైకి 20 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డును నిర్మిస్తాం. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసుకోవడానికి రెండవ ఘాట్‌రోడ్డును పూర్తి చేస్తాం. భక్తుల ఇబ్బందులు తొలగించడానికే.. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల ఇబ్బందులు తీర్చడానికి ప్రభుత్వం రూ.26.6 కోట్లు మంజూరు చేసింది. గతంలో నేను ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు నిధులు మంజూరు చేయించాను. త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తాం. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను నా హయాంలో పరిష్కరించడం ఆనందంగా ఉంది. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోనే నిధులు మంజూరు చేయించగలిగా. - బూడిద భిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్యే, ఆలేరు రెండో ఘాట్ రోడ్డు రావడం సంతోషం రెండో ఘాట్ రోడ్డు మంజూరు కావడం ఆనందించదగ్గ విషయం. గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు పడుతున్న కష్టాలు తీరినట్లే. శని, ఆదివారాల్లో వాహనాల ట్రాఫిక్ సమస్య ఈ ఘాట్‌రోడ్డుతో తీరనుంది. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌కు కృతజ్ఞతలు. - రమేష్‌బాబు, తెలంగాణ దేవాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్