సాక్షి, యాదాద్రి: ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలను చెక్కడం వివాదంగా మారుతోంది. ఆలయ స్తంభానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో పిల్లర్‌కు సీఎం కేసీఆర్ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపు అష్టభుజి ప్రాకార మండపంలో కారుగుర్తు, కేసీఆర్ కిట్టు, తెలంగాణ లోగోలో చార్మినార్‌ను అమర్చినట్లు చెక్కారు. వీటిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్థానిక బీజేపీ నేతలతో కలిసి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి స్తంభాలపై చెక్కిన కేసీఆర్, కారు బొమ్మలను తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజులు టైం ఇస్తున్నామని హెచ్చరించారు. వారంలోపు తొలగించకపోతే దేశంలో ఉన్న హిందూవాదులందరితో కలిసి ఆందోళనకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని ప్రపంచస్థాయి క్షేత్రంగా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ఆయన బొమ్మలను వేయడం సరికాదన్నారు. రాష్ట్ర నాయకత్వంతో చర్చించి త్వరలోనే యాదాద్రిపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. భావితరాలకు తెలియజేయడానికి నాయకుల బొమ్మలను చెక్కితే, వారు చేసిన అవినీతిని కూడా చెక్కుతారా.? అని నిలదీశారు. కాగా రాజాసింగ్ రాక సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు.
మరోవైపు యాదాద్రి కొండపైన సీఎం కేసీఆర్, కారుగుర్తు, కేసీఆర్ కిట్టు, హరితహారం వంటి చిత్రాలను ఆలయంలో పిల్లర్లపై చెక్కడంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ భజరంగ్‌దళ్, హిందుపరిరక్షణ సమితి, విశ్వహిందు పరిషత్, హిందుత్వ వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికితోడు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment