యాదగిరిగుట్టకు చేరుకున్న రాఘవరెడ్డి పాదయాత్ర
యాదగిరిగుట్ట : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రాక్షసపాలన.. తెలంగాణలో కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న బాధలకు విముక్తి కలగాలని నృసింహుడిని కోరుకున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతం చేయాలని, 29న సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అవుతున్న సందర్భంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 25న హైదరాబాద్‌లో చేపట్టిన పాదయాత్ర యాదగిరిగుట్టకు శుక్రవారం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్‌రెడ్డి సంకల్పయాత్ర నిర్ణయం తీసుకున్నారంటే.. అక్కడ చంద్రబాబు పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నారన్నారు.
40నెలల పాలనలో సీఎం కేసీఆర్ మాటల గారడీతో ప్రజల మభ్యపెడుతున్నారని, చంద్రబాబు నాయుడు ఆకాశానికి అందని హామీలు ఇస్తూ ప్రజలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. కేసీఆర్‌ది మాటల గారడీ తప్ప.. ముఖ్యమంత్రిగా ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయాల్లో పొంతనలేకుండా పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, భగవంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వడ్లోజు వెంకటేశ్‌లు మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ«శయాలను సాధించే దిశగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే నాయకుడిగా, ప్రజల సంక్షేమం కోసం ఉద్యమాలు చేసే నేతగా వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని తెలిపారు.
పాదయాత్రకు ఘన స్వాగతం...
పార్టీ ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి రాఘవరెడ్డి చేపట్టిన పాదయాత్రకు యాదగిరిగుట్టలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వడ్లోజు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం ఫలికారు. కళాకారుల ఆటపాటలు, బాణసంచాల కాల్చుతూ యాదగిరిగుట్ట శివారులో గుండ్లపల్లి నుంచి శ్రీరాంనగర్‌కు చేరుకుని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ పూలే విగ్రహాలకు పూల మాల వేసి, బస్టాండ్, పాతగుట్ట చౌరస్త మీదుగా వైకుంఠ ద్వారం వద్దకు చేరుకుంది.
అనంతరం జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు మందడపు వెంకట్‌రాంరెడ్డి, విజయ ప్రసాద్, చెరుకు శ్రీనివాస్, సీఈసీ సభ్యుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుమ్మ అప్పిరెడ్డి, సేవదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆజాద్, ఆయా జిల్లాల అధ్యక్షుడు నాడం శాంత కుమార్, వడ్లోజు వెంకటేష్, భగవంత్‌రెడ్డి, రవీందర్, నరేందర్‌రెడ్డి, బీవీ మోహన్, రాఘవరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, అప్పం కిషన్, బాన్సువాడ కో ఆర్డినేటర్ రామ్మోహన్, కల్వకొలను సతీష్‌రాజ్, విజయ్‌ప్రసాద్, సుమన్‌గౌడ్, ముదిగొండ శ్రీకాంత్, గోవర్ధన్‌రెడ్డి, వేణుప్రసాద్ గౌడ్, అకిలేష్‌గౌడ్,రవీందర్‌గౌడ్, మాదగోని జంగయ్యగౌడ్, హరికృష్ణ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment