ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘రామ రాజ్యం రావాలి.. రాజన్న పాలన కావాలి.. సీతారామచంద్రుల కల్యాణోత్సవం సాక్షిగా మేమిదే కోరుకుంటున్నాం. ఇలాగే వేడుకుంటున్నాం’ అని నరసరావుపేట పట్టణంలో వేద పండితులు వైఎస్ జగన్‌తో అన్నారు. అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ‘హోదా కోసం మా అన్న రామబాణం వదిలాడు. అడ్డుపడుతున్న పది తలల రావణుడులాంటి చంద్రబాబు సర్కారు ఇక నేల కూలాల్సిందే’ అని శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పేందుకు 30 కేజీల కేకుతో సిద్ధంగా ఉన్న సువర్చల, వసంత లక్ష్మిలు ఆవేశంగా చెప్పారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 120వ రోజు ఆదివారం గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పూర్తి చేసుకుని సత్తెనపల్లి నియోజకవర్గంలో అడుగుపెట్టింది.
పాదయాత్ర సింహభాగం నరసరావుపేటలోనే సాగడంతో పట్టణం జన సంద్రమైంది. ప్రజా వెల్లువను దాటుకుని ముందుకెళ్లడానికి జననేతకు గంటల కొద్దీ సమయం పట్టింది. అడుగడుగునా హారతులిచ్చే మహిళలు.. ‘అన్నా ఒక సెల్ఫీ ప్లీజ్...’ అంటూ గుంపులు గుంపులుగా వచ్చారు. ‘అయ్యా సల్లంగుండు..’ అంటూ దీవించే అవ్వాతాతలు, నువ్వొస్తే ఈ రాష్ట్రానికే పండగే అని చెప్పిన అక్కచెల్లెమ్మలు అడుగడుగునా కనిపించారు. చుట్టూ జన సమూహం.. ఆ జనవాహినిలో జగన్ ఎక్కడున్నాడో తెలియని సరికొత్త సన్నివేశం కనిపించింది. ఎండ మండిపోతున్నా జనం బారులు తీరారు. మైళ్ల కొద్దీ హుషారుగా ఆయన వెంటే కదిలివచ్చారు. నినాదాల హోరు, డప్పు దరువుల కోలాహలం, గెంతులేసే కుర్రకారు హుషారు.. ఎటుచూసినా పండుగ వాతావరణమే.
దశ తిరిగే రోజొచ్చె..
‘మాకివ్వాళ రెండు పండుగలొచ్చాయి.. ఒకటి శ్రీరామ నవమి. ఇంకోటి మా అన్న పాదయాత్ర’ అని సీతారాముల వారి గుడికి వెళ్లివస్తున్న చంద్రశేఖర్, సుగుణమ్మ దంపతులు సంబరపడుతూ చెప్పారు. ఈ రెండు పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఉందని నరసరావుపేటకు చెందిన బీటెక్ విద్యార్థిని మృణాళిని తెలిపింది. జగన్‌ను చూడాలని పట్టణ వీధుల్లో జనం పరుగులు పెట్టారు. ‘నేను సీతారాములకు హారతిచ్చాను.. ఇదే హారతి పళ్లెంతో జగన్‌కూ హారతి పడతాను’ అంటూ దాదాపు గంట నుంచి ఎదురు చూస్తున్న పల్లవి, విష్ణుప్రియ తెలిపారు. భారీ జనవాహిని మధ్య జగన్ పాదయాత్ర సాగుతుండటంతో రోడ్ల వెంబడి గంటల కొద్దీ నిరీక్షించే మహిళలు కాలక్షేపం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంత్యాక్షరి, డ్యాన్సులతో జగన్ వచ్చే వరకూ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేశారు. ఒక చోట వేద పండితులు పురాణ పఠనం గావించారు. ‘నవమి వెళ్లి దశమి వస్తోంది.. రాష్ట్రానికి దశ తిరిగే రోజొస్తుంది.. జగన్ వస్తాడు.. రామరాజ్యం తెస్తాడు’ అని విష్ణుమూర్తి అనే పండితుడు చెబుతుంటే జనం మంత్ర ముగ్ధులయ్యారు.
భారీగా తరలివచ్చిన మహిళలు
బరంపేట, బీసీ కాలనీ, ఇసప్పాలెం, ములకలూరు, గొల్లపాడు, ముప్పాళ్ల.. ఎక్కడికెళ్లినా బోసినవ్వుల పసిపాపలతో జగన్‌ను చూసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తన దగ్గరకొచ్చిన ప్రతీ చిన్నారిని ఆయన ఆప్యాయంగా ఎత్తుకోవడం చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. రోప్‌లోకి వెళ్తున్నప్పుడు చెయ్యెత్తి కేరింతలు కొట్టే చిన్నారులను జగన్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం కనిపించింది. ఆ సన్నివేశాలను మహిళలు చెరగని గుర్తులుగా భావిస్తున్నారు. ‘మా వాడిని అన్న ముద్దాడాడు.. జీవితంలో ఇది మరిచిపోలేని సంఘటన’ అని బరంపేట వద్ద సుచరిత అనే మహిళ సంబరపడుతూ చెప్పింది. విద్యార్థులైతే జగన్‌తో సెల్ఫీల కోసం పోరాటమే చేశారు. ‘అన్నా ప్లీజ్ ఒక సెల్ఫీ..’ అంటూ జనాన్ని తోసుకుంటూ ఆయన దగ్గరకొచ్చారు. ఆ కంగారులో ఫోన్ కెమెరా ఆన్ చేయడానికి తడబడ్డారు. ఇది గమనించిన జగన్ తానే స్వయంగా ఫోన్ చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ సెల్ఫీ తీసిచ్చారు. ఫొటో ఎలా వచ్చిందోనని రోప్ దాటకముందే ఆత్రంగా యువతులు చూసుకోవడం కనిపించింది. తర్వాత ఆ ఫొటోలను పది మందికీ చూపిస్తూ సంబరపడ్డారు.
హోదా సాధించాలి.. వేదనలు తీర్చాలి
ప్రతీ అడుగులోనూ జనం ప్రత్యేక హోదాను గుర్తు చేసుకున్నారు. హోదా వస్తేనే బతుకులు బాగుపడతాయని ఆకాంక్షించారు. రెడ్డి కాలనీకి చెందిన కొండా చినలక్ష్మి కొబ్బరి బోండాలు అమ్ముకుంటూనే ఇద్దరు పిల్లలను చదివిస్తున్నామని, చంద్రబాబు హోదాను తాకట్టుపెడితే పిల్లల భవిష్యత్ ఏమిటనే బెంగ పట్టుకుందని జగన్‌తో చెప్పింది. ‘అన్నా మీరే మాకు దిక్కు. హోదా కోసం ఉద్యమించే ధైర్యం మీకే ఉందన్నా’ అంటూ ఆమె మనసులో మాట చెప్పుకుంది. అంధుల పాఠశాల విద్యార్థులు జననేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు.
కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని విన్నవించారు. రామరాజ్యం తేవాలంటూ మట్టపాలెం వద్ద జగన్‌కు కొంతమంది భగవద్గీతను బహూకరించారు. నువ్వొస్తే పేదల బతుకులు బాగుంటాయంటూ 70 ఏళ్ల ఖాదర్‌బీ ఆచారంగా వస్తున్న టోపీని అభిమానంతో బహూకరించింది. మద్యం మహమ్మారి తమ బతుకులను కాలరాస్తోందంటూ కొంత మంది మహిళలు జననేత ఎదుట బావురుమన్నారు. పంచాయతీల అధికారాలన్నింటినీ చంద్రబాబు జన్మభూమి కమిటీలు మింగేస్తున్నాయని, సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాల్లా చేస్తున్నాయని, పచ్చచొక్కాల అవినీతి పల్లె ప్రగతిని హరిస్తున్నాయని సర్పంచ్‌ల సంఘం నేతలు జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా అడుగడుగునా కష్టాలు విన్నవించే జనం.. ఇష్టంగా వచ్చామని ఆనందంగా చెప్పిన ప్రజలు.. అందరి మాటలు వింటూ... ఆప్యాయ పలకరింపులతో జగన్ ముందుకు సాగారు.
రామరాజ్యం రావాలన్నా..
Published Mon, Mar 26 2018 1:20 AM | Last Updated on Sat, Jul 28 2018 4:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment