భువనగిరి, న్యూస్‌లైన్: ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న యాదగిరిగుట్ట రెండో ఘాట్ రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.26.6 కోట్లను మంజూరు చేసింది. సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఘాట్‌రోడ్డు పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభం కానున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు వచ్చిపోతుంటారు. ఒక్కోరోజు భక్తుల సంఖ్య లక్ష వరకు ఉంటుంది.
భక్తులు కొండపైకి చేరుకోవడానికి మూడు మెట్ల మార్గాలు, ఒక ఘాట్‌రోడ్డు మార్గం ఉంది. నృసింహ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఒక మెట్ల మార్గాన్ని అధికారులు మూసివేశారు. రోజురోజుకూ భక్తుల రద్దీతో పాటు వాహనాలు, ఆటోలు, ద్విచక్రవాహనాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో పాటు సెలవు రోజులు, పుణ్య దినాలు, ప్రత్యేక రోజుల్లో భక్తుల రద్దీని తట్టుకోవడానికి ప్రధానంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నా ట్రాఫిక్ సమస్య తలనొప్పిగా మారింది. పోలీసులకు, అధికార యంత్రాంగానికి, భక్తులకు ఇబ్బందులు సృష్టిస్తున్న ఘాట్ రోడ్డు సమస్య పరిష్కారానికి ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
డబుల్ రోడ్డుగా..
కొండపైకి ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చనున్నారు. దీన్ని కొండపై నుంచి భక్తులు కిందికి రావడానికి ఉపయోగిస్తారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం రెడ్డి సత్రం వద్ద జంక్షన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 100 మీటర్ల ఘాట్ రోడ్డును కొండ వెనక భాగం నుంచి నిర్మిస్తారు.
దీనిని అలా పున్నమి గెస్ట్‌హౌస్ పక్కగా ఏర్పాటు చేసి ప్రస్తు తం ఉన్న రోడ్డుకు కలుపుతారు. అదే విధంగా ఆలేరు వైపు నుంచి వచ్చే భక్తుల కోసం యాదగిరిపల్లి గోశాల ద్వారా అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేస్తారు. ఇది హరిత భవన్ నుంచి రెండవ కమాన్ వద్ద రెండవ ఘాట్‌రోడ్డు కొండపైన కలుస్తుంది. దీని పొడవు సుమారు 1.2 కిలోమీటర్లు ఉంటుంది. కొండ వెనక భాగంలో స్వాగత తోరణం వద్ద విశాలమైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం రోడ్డును డబుల్‌రోడ్డుగా ఏర్పాటు చేస్తారు. మెట్ల దారి పాదాల వద్ద మరో జంక్షన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూస్తారు.
త్వరలో పనులు ప్రారంభం :
వసంత, ఆర్‌అండ్‌బీ ఈఈ
రెండవ ఘాట్‌రోడ్డు పనులకు త్వరలో టెండర్లు పిలుస్తాం. 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఇందుకోసం కసరత్తు చేస్తున్నాం. ప్రత్యేక దినాల్లో కొండపైకి 20 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డును నిర్మిస్తాం. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసుకోవడానికి రెండవ ఘాట్‌రోడ్డును పూర్తి చేస్తాం.
భక్తుల ఇబ్బందులు తొలగించడానికే..
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల ఇబ్బందులు తీర్చడానికి ప్రభుత్వం రూ.26.6 కోట్లు మంజూరు చేసింది. గతంలో నేను ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు నిధులు మంజూరు చేయించాను. త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తాం. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను నా హయాంలో పరిష్కరించడం ఆనందంగా ఉంది. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోనే నిధులు మంజూరు చేయించగలిగా.
- బూడిద భిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్యే, ఆలేరు
రెండో ఘాట్ రోడ్డు రావడం సంతోషం
రెండో ఘాట్ రోడ్డు మంజూరు కావడం ఆనందించదగ్గ విషయం. గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు పడుతున్న కష్టాలు తీరినట్లే. శని, ఆదివారాల్లో వాహనాల ట్రాఫిక్ సమస్య ఈ ఘాట్‌రోడ్డుతో తీరనుంది. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌కు కృతజ్ఞతలు.
- రమేష్‌బాబు, తెలంగాణ దేవాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్