భూకుంభకోణం నిందితులకు రిమాండ్
హైదరాబాద్: నగరంలో సంచలనం రేపిన ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో ముగ్గురు నిందితులను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.587కోట్ల విలువైన 693 ఎకరాల ప్రభుత్వ భూమిని పారిశ్రామిక వేత్తలకు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని మూసాపేట రిజిస్టార్ శ్రీనివాసరావు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
అదేవిధంగా అప్పనంగా భూములను పొందిన గోల్డ్ స్టోన్ ఇన్‌ఫ్రా ప్రతినిధి పార్థసారథిని, అకౌంటెంట్ శర్మలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు నిందితులకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించాని కోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణ కోసం ముగ్గురు నిందితులను పదిరోజుల కస్టడీకి అనుమతినివ్వాలిని పోలీసులు పిటీషన్ దాఖలు చేయనున్నారు.
ఈభూముల అక్రమ రిజిస్ట్రేషన్లలో సుమారు పదివేల కోట్ల కుంభకోణం జరిగినట్లు అధికారులు, భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఇప్పటి వరకూ జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.