
పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు: డీజీపీ
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ స్థాయిలో పోలీసింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్టు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా జీపీఎస్ విధానంపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించేందుకు బంజారాహిల్స్‌లోని ఆస్కిలో శిక్షణ తరగతులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అంతార్జతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోలీసింగ్, జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినున్నట్టు చెప్పారు.
ప్రతి పోలీస్ స్టేషన్‌కు రక్షక్ వాహనానికి జీపీఎస్ అనుసంధానం చేయడం వల్ల నేరం జరిగిన ప్రాంతానికి క్షణాల్లో చేరుకునేందుకు వీలుంటుందన్నారు. నగరంలో ఎక్కడ నేరం జరిగినా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం చేరుతుందని, తద్వారా నేరస్థుడు ఎక్కడ ఉన్నా పట్టుకోవచ్చని తెలిపారు. జీపీఎస్ విధానాన్ని మొదట హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌ల పరిధిలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.