పోలీస్ టెన్షన్...
- జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో ర్యాలీలు, సమావేశాలు షురూ
- రోజుకు వందకుపైగా దరఖాస్తులు
- ఆచితూచి అనుమతులిస్తున్న అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం శనివారంతో ముగియడంతో నేతలు ఆదివారం నుంచి ప్రచారం ప్రారంభించారు. ఇటీవల శ్రీరామనవమి శోభాయాత్రకు బందోబస్తు నిర్వహించిన పోలీసులు ఊపిరి తీసుకునే లోపే రేపు హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే విజయయాత్ర బందోబస్తుకు సిద్ధమవుతున్నారు. ఓ పక్క ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవాలు, నేతల ఇంటింటి ప్రచారం, సభలు, సమావేశాలతో కంటి మీద కునుకు లేకుండా తిరుగుతున్నారు. ఇందుకోసం ముందస్తుగా వారు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. దీంతో ఆయా పార్టీల నేతలు పోలీసు అనుమతులు కోరుతూ డివిజన్, జోన్, కమిషనర్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ప్రచారం ఊపందుకోవడంతో పోలీసుల్లో టెన్షన్ పెరిగింది.
ఆనుమతులపై ఆచితూచి అడుగు..
జంట పోలీసు కమిషనరేట్ పరిధిలో సభలు, సమావేశాలు, ర్యాలీల అనుమతులు కోరుతూ రోజూ వందకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తును కింది స్థాయి అధికారి నుంచి పైస్థాయి అధికారి వరకు క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతులిస్తున్నారు. ఒక ప్రాంతంలో ఒకే సమయంలో ఇరు పార్టీలు అనుమతి కోరితే.. మొదట ఏ పార్టీ దరఖాస్తు చేస్తే వారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో సభలు, ర్యాలీల నిర్వహణపై వచ్చే దరఖాస్తులపై అధికారులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
అనుమతి ఇచ్చే ముందు ఆ ప్రాంతం సమస్యాత్మకమైందా?.. అంత్యత సమస్యాత్మకమైందా?.. సాధారణంగా ఉందా అనేది మొదట పరిశీలిస్తున్నారు. అంత్యంత సమస్యాత్మక ప్రాంతమైతే ఏపీఎస్పీ, ఏఆర్ బలగాలతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. సమస్యాత్మక ప్రాంతమైతే స్థానిక పోలీసులతో పాటు ఆర్మడ్ రిజర్వు, టాస్క్‌ఫోర్స్ పోలీసులను సిద్ధం చేస్తున్నారు. సాధారణ ప్రాంతమైతే స్థానిక పోలీసులకు తోడు ఆర్మడ్ రిజర్వు సిబ్బంది బందోబస్తులో ఉంటున్నారు. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీల అధినేతలు నగరంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఇవి మరింత ముమ్మరం కానున్నాయి. దీంతో భారీ బందోబస్తు ఏర్పాట్లలో పోలీసుల తలమునలవుతున్నారు.
పక్కాగా కోడ్ అమలు
పోలీసులు ఎన్నికల కోడ్‌ను, నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా రాజకీయ పార్టీ అభ్యర్థి ఉపయోగించే వాహనాలను సీజ్ చేయాలని జంట పోలీసు కమిషనర్లు అనురాగ్‌శర్మ, సీవీ ఆనంద్‌లు ఇన్‌స్పెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏ పార్టీకీ అనుకూలంగా మెలగరాదని సూచించారు. ఏదైనా పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.