ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బల ప్రదర్శన | KCR knows whose story is what: Mutthi Reddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బల ప్రదర్శన

Published Fri, Aug 18 2023 4:19 AM | Last Updated on Fri, Aug 18 2023 11:47 AM

KCR knows whose story is what: Mutthi Reddy - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 

జనగామ /కుషాయిగూడ (హైదరాబాద్‌): నియోజకవర్గంలో అసమ్మతి నేపథ్యంలో జనగామ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలో స్థానిక పార్టీ శ్రేణులతో ర్యాలీలు, సమావేశాలు జరపడంతోపాటు హైదరాబాద్‌లోనూ భేటీ అయ్యారు. స్థానిక నాయకత్వం తన వెంటే ఉందని చాటుకునే ప్రయత్నం చేశారు. బుధవారం హైదరాబాద్‌ బేగంపేటలోని ఓ హోటల్‌లో అసమ్మతి వర్గం సమావేశం కావడం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్కడికి వెళ్లడంతో వాగ్వాదం జరగడం తెలిసిందే.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ అసమ్మతిని రాజేస్తున్నాడని ముత్తిరెడ్డి ఆరోపించారు కూడా. ఈ క్రమంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు తనతోనే ఉన్నాయనేలా గురువారం బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో భారీ ర్యాలీలు నిర్వహించడంతోపాటు ఏకకాలంలో మీడియా సమావేశాలు పెట్టి స్థానిక నేతలతో తనకు మద్దతు ప్రకటించేలా చేశారు. తర్వాత వారందరితో హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉన్న నోమా ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సెలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నేతలు తమ మద్దతు ముత్తిరెడ్డికే ఉంటుందని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మండల కమిటీలన్నీ ముత్తిరెడ్డికి మద్దతు ఇస్తున్నట్టుగా చేసిన తీర్మానాల పత్రాలను ముత్తిరెడ్డికి అందజేశారు.

కావాలని అభాసుపాలు చేస్తున్నారు: ముత్తిరెడ్డి
తనపై కుట్రలు కొత్తేమీ కాదని.. ఇంతకుముందు 2014లో, 2018లోనూ కుట్రలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. తానేమిటో తెలిసిన సీఎం కేసీఆర్‌ రెండుసార్లు తనకే టికెట్‌ ఇచ్చారని.. నియోజకవర్గ ప్రజలు గెలిపించారని చెప్పారు. మల్లాపూర్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నాటి కుట్రల పాచికలు పారకపోవడంతో తాజాగా కుటుంబ కలహాల బూ చితో నన్ను అభాసుపాలు చేసేందుకు, వివాదా స్పదుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు అధినేత కేసీఆర్‌పై నమ్మకముంది. ఉద్యమ నాయ కుడిగా, పార్టీ సైనికుడిగా నాకు గుర్తింపునిస్తూనే వచ్చారు. భవిష్యత్తులో కూడా నాకు ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఈ సమావేశానికి సంబంధించిన అంతర్యాన్ని, నిర్ణయాలను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా..’’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement