పోలీస్ vs నక్సల్స్ | Police vs Maoists | Sakshi
Sakshi News home page

పోలీస్ vs నక్సల్స్

Published Mon, Jul 7 2014 1:33 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Police vs Maoists

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు, మావోయిస్టుల కదలికలు ముమ్మరమయ్యాయి. దండకారణ్య సరిహద్దులో ఒకరిపై ఒకరు పట్టు సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో బహిరంగంగానే కార్యకలాపాలు నెరుపుతూ మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతుండగా, మావోయిస్టులు, సానుభూతిపరులు ఎక్కడ తారసపడినా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని తెలుస్తోంది. అయితే, మావోల సానుభూతిపరులనే కోణంలో గత గురువారం జిల్లా పోలీసులు ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది. వీరు విడుదలయ్యారా? లేక పోలీసుల అదుపులోనే ఉన్నారా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఈ ముగ్గురిని అకారణంగా అదుపులోకి తీసుకున్నారని, వీరిని వెంటనే విడుదల చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 గ్రామాల్లో సంచరిస్తున్న మావోలు...
 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న మావోలు, పోలీసుల కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. భద్రాచలం ఏజెన్సీ పరిధిలో, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మావోలు హల్‌చల్ చేస్తున్నారు. ఈ సమాచారం పోలీసులకు ఎప్పటినుంచో ఉన్నా ప్రభుత్వ పాలసీ ఎలా ఉంటుందోనన్న ఆలోచనతో వేచిచూసే ధోరణి అవలంబించారు. అయితే, ఇటీవల పోలీసు అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో మావోల పట్ల పాత పద్ధతిలోనే వెళ్లాలని సూచనప్రాయంగా వెల్లడించిన నేపథ్యంలో ఇరు వర్గాలు అప్రమత్తమయ్యాయి.

 తెలంగాణ  - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న దుమ్ముగూడెం మండలంలోని గిరిజన గ్రామాలలో మావోయిస్టుల కదలికలు అధికంగా కనబడుతున్నట్లు నిఘావర్గాల సమాచారం. నక్సల్స్ గ్రామాలలోకి రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు వ్యూహాత్మకంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలు ఎక్కువయ్యాయని తెలుసుకున్న పోలీసులు వారం రోజుల క్రితం ప్రత్యేక బలగాలతో కూంబింగ్ నిర్వహించారు. ఆ సమయంలో శబరి ఏరియా కమిటీ కార్యదర్శి మడ కం కోసితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

కోసిని గత శుక్రవారం రాత్రి అదుపులోనికి తీసుకోగా ఆమె వివరాలు తెలుసుకోవడానికి గత ఆదివారం దుమ్ముగూడెం మావోయిస్టు ఇన్‌చార్జ్ సంతోష్ (సంతూ) ఆధ్వర్యంలో శబరి ఏరియా కమిటీ, వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టులు దుమ్ముగూడెం మండలం గౌరారం గ్రామం వరకు వచ్చినట్లు సమాచారం. గత సోమవారం కూడా పైడిగూడెం, తొగ్గూడెం ప్రాంతాలలో సంచరించినట్లు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని కిష్టారం పోలీస్ స్టేషన్ అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ క్రమంలో గత మంగళవారం సాయంత్రం కూంబింగ్ చేస్తున్న పోలీసులకు తీగనపల్లి వద్ద మావోయిస్టులు తారసపడడంతో వారి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

 ఆ సమయంలో మావోయిస్టులు తప్పించుకుపోగా పోలీసులకు ఇద్దరు యువకులు దొరికినట్లు సమాచారం. తాము వచ్చినట్లు మావోలకు సమాచారం ఎందుకు చేరవేశారని పోలీసులు ఆ ఇద్దరిని చితకబాదినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గత బుధవారం మావోయిస్టు మిలటరీ ప్లాటూన్ బలగాలు దండకారణ్యంలోకి చేరుకున్నాయి. దీంతో పోలీసులు వ్యూహాత్మకంగా కూంబింగ్ నిర్వహించడంతో పాటు మావోలను తెలంగాణా సరిహద్దుల్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పోలీసుల కూంబింగ్ వివరాలను మావోయిస్టులు ఎప్పటికప్పుడు  కొరియర్ల ద్వారా తెలుసుకుని అప్రమత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఇరువర్గాల కార్యకలాపాలతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి.

 ఇంజనీరింగ్ విద్యార్థుల అరెస్టు...
 కాగా, మావోల సానుభూతిపరులనే నెపంతో జిల్లా కేంద్రంలో ముగ్గురు ఇంజనీరింగ్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ సమావేశం గురించి ఖమ్మం పీజీ కళాశాల విద్యార్థులతో చర్చించేందుకు వచ్చిన వరంగల్ జిల్లా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారని సమాచారం. వీరిని కొత్తగూడెం పోలీసులు పట్టుకెళ్లారనే చర్చ జరుగుతోంది. వీరిని వెంటనే విడుదల చేయాలని, పోలీసు నిర్బంధాలను నిలిపివేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీరిని ఎక్కడికి తీసుకువెళ్లారన్నది మాత్రం పోలీసులు ధ్రువపరుస్తుండకపోవడం గమనార్హం.

 కొరియర్ వ్యవస్థపై డేగ కన్ను...
 మరోవైపు పోలీసులు, మావోయిస్టులు కొరియర్ వ్యవస్థపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. పోలీసు ఇన్‌ఫార్మర్లపై మావోలు, మావోల కొరియర్లపై పోలీసులు డేగ కన్ను వేసి విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టులు సరిహద్దుల్లోకి అడుగు పెట్టగానే పోలీసులకు సమాచారం అందుతోంద ని భావిస్తున్న మావోలు నిఘాను ఉధృతం చేసినట్లు సమాచారం. రెండు నెలల క్రితం ఎడ్లపాడులో జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు క్షణాల్లో తప్పించుకున్నారు.

ఎడ్లపాడులో ఉన్న విషయం పోలీసులకు సమాచారం ఇచ్చింది ఎవరనే దానిపై కూడా మావోలు ఇప్పటికే ఆరా తీసినట్లు తెలిసింది. ఇలాంటి సమాచారం మరోసారి బయటకు తెలియకుండా ఉండేందుకే పోలీస్ ఇన్‌ఫార్మర్ వ్యవస్థపై మావోయిస్టులు డేగ కన్ను వేసినట్లు సమాచారం.  ఈ పరిస్థితుల్లో ఇన్‌ఫార్మర్, కొరియర్ ముద్ర వేసి అటు పోలీసులు, ఇటు మావోయిస్టులు తమను ఎక్కడ ఇబ్బందులకు గురిచేస్తారోనని సరిహద్దు గ్రామాల ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement