రాజకీయ కురువృద్ధుడు మృతి | political kuruvrddhudu gaddam narasimha reddy no more | Sakshi
Sakshi News home page

రాజకీయ కురువృద్ధుడు మృతి

Published Sun, Mar 16 2014 12:42 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

political kuruvrddhudu  gaddam narasimha reddy no more

 మంచిర్యాల అర్బన్ న్యూస్‌లైన్ : గడ్డం నర్సింహారెడ్డి.. ఆయనో వివాదరహితుడు. ముక్కుసూటి మనిషి. అజాత శత్రువుగా పేరొందిన గడ్డం నర్సింహారెడ్డి (81) శనివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి తండ్రి అయిన నర్సింహారెడ్డి మంచిర్యాల పురపాలక సంఘం చైర్మన్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అప్పట్లో జనరల్ స్థానం కాగా నర్సింహారెడ్డి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.
 
  1970 నుంచి 1984 రెండు పర్యాయాలు ఎంపీగా కొనసాగారు. ఆ సమయంలోనే పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ సభ్యునిగా కూడా కొనసాగారు. అలాగే డీసీసీ ప్రెసిడెంట్‌గానూ చేశారు. అలా ఢిల్లీ వరకు ప్రయాణం సాగిచి జాతీయ రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. మృతిచెందే నాటికి కూడా ఏఐటీసీసీ సభ్యుడిగానే ఉన్నారు. అంతకు ముందు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న  ఐదేళ్లు విద్యాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మంచిర్యాల లోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాల భవనాలు ఆయన హయాంలోనే నిర్మాణం జరిగాయి.
 
 
 మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి పట్టణ నడిబొడ్డులోని విలువైన స్థలాన్ని ఇచ్చారు. తన తండ్రి గంగారెడ్డి స్మారక ఆస్పత్రిగా నామకరణం చేశారు. తునికాకు కాంట్రాక్టర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో ఏ అగ్ర నాయకుడు వచ్చినా నర్పింహారెడ్డి నివాసంలోనే బస చేస్తుండేవారు. అందుకే ఆయన నివాసాన్ని స్థానికులు గాంధీభవన్‌గా పిలుస్తుంటారు. నర్సింహారెడ్డి పెద్ద కుమారుడు అరవింద్‌రెడ్డి రాజకీయాల్లోకి వారసునిగా 2002లో రంగ ప్రవేశం చేశారు. టీఆర్‌ఎస్ తరఫున రెండు పర్యాయాలు పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
 
 భార్య చందనారెడ్డి ఉండగా గంగారెడ్డి, అచ్యుత్‌రెడ్డి ఇద్దరు కుమారులు వ్యాపారం రంగంలో స్థిరపడ్డారు. కూతురు అనురాధ ఉన్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న నర్సింహారెడ్డి మృతిచెందడం స్థానిక రాజకీయ వ ర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం ఆయన పార్థివ దేహాన్ని మంచిర్యాలకు తీసుకురానున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement