మండలకేంద్రంలో అన్ని సౌకర్యాలతో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల
సాక్షి, బేల: వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల నేపథ్యంలోనైనా..ఏళ్ల నుంచి ప్రతిసారి ఎన్నికల నిర్వహణ కోసం కొనసాగుతున్న మండలకేంద్రం తాలూకు 1కిలోమీటరు పైబడి దూరపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్‌ల కేంద్రం మారేనా..?అంటూ స్థానిక ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల నుంచి కొనసాగుతున్న అదే దూరపు పోలింగ్ కేంద్రం ఇంకెనాళ్లని వారు అంటున్నారు.
ఈ దూరపు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వయసు పైబడ్డ వయోజనులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఆసక్తి చూపెట్టడం లేదని తెలుస్తోంది. దీంతో పాటు ఓటు వేయడానికి దూరంగా ఉండిపోతున్నారు. కాగా ప్రస్తుతం మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో 3,324మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలాగైతే..ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రంలోని మూడు బూత్‌లలో మొత్తంగా 85శాతం పోలింగ్ దాటలేదు. దీంతో పోలింగ్ ఇప్పటికినీ 90శాతం మించలేదు. ఈ పోలింగ్ కేంద్రాన్ని మండలకేంద్రం మధ్యన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మార్చాలని స్థానిక ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రానికి..
మండలకేంద్రం తాలూకు 1కిలోమీటరు పైబడి దూరంలోని పోలింగ్ కేంద్రానికి ప్రైవేటు వాహనాల్లో ఓటర్లను ఓటు వేయడానికి ఆయా పార్టీల వారు ప్రత్యేకంగా తీసుకెళ్తున్నారు. ఇలా తీసుకెళ్లడంతోనూ ఎన్నికల ఖర్చు పెరుగుతోంది. దీంతో పాటు ఈ వాహనాల్లోనూ ఓటర్లను ప్రలోభాలు చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.
ఆసక్తి తగ్గుతోంది
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఈ పోలింగ్ కేంద్రం దూరమవుతుందని, దగ్గరకు మార్చాలని గతంలో పలుమార్లు అప్పటి అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినాం. ఎవరు పట్టించుకోలేదు. ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లడానికి వయోజనులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ దూరపు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ఆసక్తి తగ్గుతోంది. ఏళ్ల నుంచి ఎన్నికల కోసం కిలోమీటరు దూరపు పోలింగ్ కేంద్రం మార్పు ఇంకెప్పుడో..?తెలియడం లేదు.
–గౌరి పురుషోత్తం, ఓటరు
ప్రభుత్వ కళాశాలకు మార్చాలి
ఇప్పటిదాకా ఎన్నికల కోసం కొనసాగుతున్నకిలోమీటరు దూరపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, ఓటర్లందరికి దగ్గరగా ఉన్న మండలకేంద్రం మధ్యన ఉన్న అన్ని సౌకర్యాలతో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మార్చాలి. గతంలో ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో, పోలింగ్ కేంద్రాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్ణయించారు. ఇప్పుడు ఆఫీసర్లు దీన్ని గుర్తించి, దూరపు పోలింగ్ కేంద్రాన్ని దగ్గరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మార్చాలి.
–మెహబుబ్ ఖాన్
ఎన్నికల అధికారులు స్పందించాలి
ఈ పోలింగ్ కేంద్రం మార్పుపై ఎలక్షన్ ఆఫీసర్లు స్పందించాలి. గతంలో వేరు. ఇప్పుడు వేరు పరిస్థితులు ఉన్నాయి. గతంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తప్ప, మరో పెద్ధ భవనం లేదు. ఇప్పుడు ఆరేళ్ల నుంచి దగ్గరలో పూర్తిస్థాయిలో సౌకర్యవంతంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఈ పోలింగ్ కేంద్రాన్ని మార్చాలి.
–బ్యాతంవార్ ప్రకాశ్
Comments
Please login to add a commentAdd a comment