ఇంటి దొంగలను గుర్తించాలి: పొంగులేటి
హైదరాబాద్ : ఇంటి దొంగలను గుర్తించకపోతే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవదని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇతర పార్టీలకు సహకరించిన వారిని గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు.
పోలవరం బోర్డు నుంచి తెలంగాణ ప్రభుత్వ అధికారులను తప్పించాలంటూ చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడం అహంకారపూరితమని పొంగులేటి మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్న బాబును టీడీపీ తెలంగాణ నేతలు ప్రశ్నించాలన్నారు. ఖమ్మం జిల్లాలో గిరిజన ప్రాంతాలను పరిరక్షించుకునేందుకు ఇతర పార్టీలతో కలిసి ఐక్య పోరాటానికి టీడీపీ నేతలు కలిసి రావాలని సూచించారు.
మరోవైపు కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గాంధీభవన్లో భేటీ అయ్యారు. పార్టీ పునర్నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై నేతలు అనుబంధ సంఘాలతో చర్చించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి కుంతియా హాజరయ్యారు.