
ఆస్తుల వివరాలు ప్రకటించాలి: పొన్నం
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్, మంత్రులు తమ ఆస్తుల వివరాలు ప్రకటించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండునెలలు దాటినా కరెంట్, సంక్షేమకార్యక్రమాలు, రుణమాఫీ అంశాలపై కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నెలన్నరలో కరెంట్ సమస్య పరి ష్కారమవుతుందని ఒకసారి, కాదు ఏడాదిన్నర అని మరోసారి సీఎం తోచినట్టు మాట్లాడుతున్నారని, తెలంగాణ ఆయన జాగీరేం కాదన్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేస్తుంటే పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, విచారణ జరిపిస్తామని సీఎం కేసీఆర్ ఎదురుదాడి చేయడాన్ని తప్పుబట్టారు.