హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన అధికారాలను బదలాయించకపోగా, జాయింట్ చెక్‌పవర్ తెచ్చి తమ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఐక్యవేదిక ఆరోపించింది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బడ్జెట్ సమావేశాల సమయంలో ‘చలో అసెంబ్లీ’ నిర్వహించాలని, ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్షలు చేపట్టాలని తీర్మానించింది. ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారమిక్కడ నిర్వహంచిన రౌండ్ టేబుల్ భేటీలో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, బీజేపీఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సీపీఐ నేత రాంనర్సయ్య, జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు 22 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.