సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికీ పరీక్ష ఫీజు చెల్లించని వారికి మరో అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. వారు తత్కాల్ కింద ఫీజు చెల్లించొచ్చని ఆయన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు రూ.1,000 తత్కాల్ ఫీజుతో పాటు పరీక్ష ఫీజును జనవరి 7లోగా చెల్లించొచ్చని సూచించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు ఆ ఫీజులను 9లోగా బ్యాంకుల్లో జమ చేయాలని సూచించారు.
మార్చిలో వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారే మే/జూన్ లో జరిగే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులని వివరించారు. మరోవైపు ఒకసారి ఫెయిలైన రెగ్యులర్ విద్యార్థులు (2016 మార్చి, జూన్ లో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వారు) 2017 మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యేలా చివరి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు.