
పోస్టల్ శాఖకు రూ.5 లక్షల జరిమానా
ఓ విద్యార్థి దరఖాస్తును సకాలంలో గమ్యస్థానానికి చేర్చడంలో నిర్లక్ష్యం వహించి, అతడు ఎంబీబీఎస్ సీటు కోల్పోయేందుకు కారణమైన పోస్టల్ శాఖకు ఉమ్మడి హైకోర్టు రూ.5లక్షల జరిమానా విధించింది.
⇔ ఎంబీబీఎస్ దరఖాస్తును అందించడంలో నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఓ విద్యార్థి దరఖాస్తును సకాలంలో గమ్యస్థానానికి చేర్చడంలో నిర్లక్ష్యం వహించి, అతడు ఎంబీబీఎస్ సీటు కోల్పోయేందుకు కారణమైన పోస్టల్ శాఖకు ఉమ్మడి హైకోర్టు రూ.5లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సీటు కోల్పోయిన విద్యార్థి సాయికుమార్‌రెడ్డికి 8 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. పోస్టల్ శాఖ తన నిర్లక్ష్యంతో ఓ ప్రతిభావంతుడైన విద్యార్థి ఆశలను నాశనం చేసిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హైదరాబాద్‌కు చెందిన కె.సాయికుమార్‌రెడ్డి ఎంబీబీఎస్ సీటు కోసం ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు సకాలంలో అందక పోవడంతో సదరు కాలేజీ సాయి కుమార్‌కు ప్రవేశాన్ని నిరాకరించింది. దీనిపై అతను ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు. టీఎస్ ఎంసెట్ ఫలితాలు వెల్లడైన తరువాత 16.9.2016న తాను తన దరఖాస్తును స్పీడ్ పోస్టు ద్వారా ఢిల్లీకి పంపానని, పోస్టల్ శాఖ ఆన్‌లైన్ ట్రాకింగ్ ద్వారా 19.9.2016న చేరినట్లు తెలిసిం దన్నారు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 7.10.16 అని వివరించాడు.
శిక్షార్హులం కాదు: సాయికుమార్‌రెడ్డి దరఖాస్తు 18.10.16న తమకు అందిందని, అప్పటికే ప్రవేశాల చివరి తేదీ ముగిసిందని ఈఎస్‌ఐ అధికారులు కోర్టుకు నివేదించారు. దరఖాస్తు సకాలంలో అందకపోవడం తమ వైపునుంచి జరిగిన తప్పని పోస్టల్ శాఖ తెలిపింది. ఇందుకు తాము ఇండియన్ పోస్టా ఫీస్ చట్టం కింద తాము శిక్షార్హులం కాదని తెలిపింది. ఈ వాద నను ధర్మాసనం తోసి పుచ్చింది. ఆ రక్షణ కేవలం సాధారణ ఉత్తరా లు, రిజిస్టర్ ఉత్తర్వు లకే వర్తిస్తుంది తప్ప... ఇతర కొరియర్ సంస్థల తో పోటీ పడుతూ చేస్తున్న స్పీడ్ పోస్ట్ కార్యకలాపాలు వాణిజ్య పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది.