వనస్థలిపురానికి చెందిన ఓ వినియోగదారుడు 2019 మార్చిలో 175, ఏప్రిల్‌లో 175, మేలో 312 యూనిట్ల విద్యుత్‌ను ఖర్చుచేశాడు. ఆయన మార్చి, ఏప్రిల్ నెలల్లో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించాడు కాబట్టి రెండో కేటగిరి కింద ఆయనకు ఒక్కో నెలకు రూ.713 చొప్పున బిల్లు వచ్చింది. మేలో 312 యూనిట్ల వినియోగంతో మూడో కేటగిరి కింద రూ.1,921 బిల్లు వచ్చింది. గతేడాది ఆ మూడు నెలల్లో 662 యూనిట్లకు మొత్తం రూ.3,346 బిల్లు వచ్చింది.
ఇదే వినియోగదారుడు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 657 యూనిట్లే కాల్చాడు. గతంతో పోలిస్తే ఐదు యూనిట్లు తగ్గాయి. కానీ, ఈ ఏడాది 3 నెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ తీయడం, వచ్చిన మొత్తం యూనిట్లను 3 నెలల సగటుగా విభజించి బిల్లు వేయడంతో కేటగిరి సహా స్లాబ్‌రేట్ మారిపోయింది. ఫలితంగా రూ.3,630 బిల్లు వచ్చింది. గతంతో పోలిస్తే తాను తక్కువ విద్యుత్ వాడినా, బిల్లెందుకు పెరిగిందంటూ ఆధారాలతో సహా అధికారులను ప్రశ్నిస్తే.. స్పందన లేదు.
ఈయనకే కాదు.. నెలకు 200 యూనిట్లలోపు వాడే 80 శాతం మంది వినియోగదారులకు ఇదే చేదు అనుభవం ఎదురవుతోంది. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనుభవాలకు పొంతన ఉండట్లేదు.
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లుల తీరుపై జనం గగ్గోలు పెడుతున్నారు. వీటిపై కొంతమంది నేరుగా సమీపంలోని విద్యుత్ రెవెన్యూ ఆఫీస్ (ఈఆర్‌ఓ) కేంద్రాలకు వెళ్లి, మరికొందరు ఆన్‌లైన్, ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు వేలకుపైగా ఫిర్యాదులందాయి. వాటిలో కొన్నిటిని పరిష్కరిస్తుంటే, మరికొన్నింటిని గాలికొదిలేస్తున్నారు. వినియోగదారులు ఆఫీసుకు వెళ్లి ఆరా తీస్తుంటే.. సరైన సమాధానం చెప్పేవారే కరువవుతున్నారు.
3 నెలల సగటు..మారిన స్లాబ్‌రేట్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9 సర్కిళ్లు, 21 డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 53 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉన్నా రు. వీరిలో 45 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు. మరో ఏడున్నర లక్షల మంది వాణిజ్య వినియోగదారులు. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు మరో 50 వేల వరకు ఉన్నాయి. వీటి ద్వారా డిస్కంకు నెలకు సుమారు రూ.1,250 కోట్ల ఆదాయం వస్తోంది. గృహ విద్యుత్ వినియోగదారుల్లో 200 యూనిట్లలోపు వాడే వారే 80 శాతం మంది ఉంటారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఏ ప్రిల్, మే నెలల్లో మీటర్ రీడింగ్ తీయలేదు. తీరా మూడు నెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ తీయడం, మొత్తం యూనిట్లను మూడు నెలలకు విభజించి లెక్కించడం వల్ల స్లాబ్‌రేట్ సహా కేటగిరీలు మారి బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. గతంలో నెలకు రూ.500 లోపు వచ్చే బిల్లు ఈ మూడు నెలలకు కలిపి రూ.3 వేలకుపైగా రావడంతో వినియోగదారులు బిత్తరపోతున్నారు. డిస్కం మాత్రం.. లాక్‌డౌన్ సమయంలో కుటుంబసభ్యులం తా రోజంతా ఇళ్లలోనే ఉండటం, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఆన్‌లో ఉంచడం వల్లే కరెంట్ వాడకం పెరిగి రెట్టింపు విద్యుత్ బిల్లులు వచ్చాయని అంటోంది.
ఓ హెల్ప్‌లైన్ సెంటర్‌లో తన విద్యుత్ బిల్లుపై సంప్రదిస్తున్న వినియోగదారుడు
40% మంది ముందే చెల్లించినా..
లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో డిస్కం విద్యుత్ బిల్లులు జారీ చేయలేదు. కానీ గతేడాది ఏ నెలలో ఎంత చెల్లించారో, అవే చెల్లింపుల ఆధారంగా ఈ ఏడాది బిల్లులు చెల్లించాలని కోరింది. ఎప్పుడైనా చెల్లించేదే కదా అని భావించి 40 శాతం మంది ఆన్‌లైన్‌లో ముందే బిల్లులు చెల్లించా రు. వీరికెలాంటి మినహాయింపులు ఇవ్వలే దు. ఏ నెల బిల్లు ఆ నెలే చెల్లించినా.. 3 నెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ తీయడం వల్ల వారంతా నష్టపోవాల్సి వచ్చింది. భారీగా పెరిగిన ఈ బిల్లులు చెల్లించే పరిస్థితుల్లో లేమంటూ వేలాది మంది వినియోగదారులు ఆన్‌లైన్, ట్విట్టర్ వేదికగా డిస్కంకు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు స్వయంగా సమీపంలోని ఈఆర్‌ఓలకు చేరుకుని, సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. వినియోగదారులకు సమాధానం చెప్పలేక, వారి ఆగ్రహాన్ని చల్లార్చలేక క్షేత్రస్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
ఆ మూడుచోట్లా తప్ప ఫిర్యాదులపై పట్టింపేది?
బంజారాహిల్స్, గ్రీన్‌లాండ్స్, సనత్‌నగర్ ఈఆర్‌ఓల పరిధిలో ఇప్పటివరకు 401 ఫి ర్యాదులు అందినట్లు తెలిసింది. అధికారులు ఆయా డివిజన్ల పరిధిలో ప్రత్యేక హెల్ప్‌డెస్కులు ఏర్పాటుచేశారు. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పు డు రికార్డు చేస్తున్నారు. మొత్తం యూనిట్లు సహా మూడు నెలల సగటు, శ్లాబ్‌రేట్, వచ్చిన బిల్లులకు వివరణ ఇస్తున్నారు. రీడింగ్, బిల్లులో సాంకేతిక లోపాలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఇతర సర్కిళ్లలో మాత్రం ఫిర్యాదులను అసలు పట్టించుకోవట్లేదనే విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment