జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు
సాక్షి, ఖమ్మం: కోవిడ్–19 (కరోనా)వైరస్ జిల్లాలో వ్యాపించకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ‘సాక్షిప్రతినిధి’తో మాట్లాడారు. కోవిడ్–19 (కరోనా)వైరస్ వ్యాపించకుండా చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ వైరస్ బారిన పడకుండా ఉంటామో వివరిస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళలు, పురుషులకు రెండు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. పురుషులకు మూడు పడకలు, మహిళలకు రెండు పడకలు సిద్ధం చేసి ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమించామని, మాస్క్‌లను సైతం సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదని, అయితే వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించి అవసరమైన మందులను జిల్లా వైద్య శాఖ సిద్ధం చేసిందన్నారు. ఈ వ్యాధి లక్షణాలకు సంబంధించి ఏ రకమైన అనుమానాలున్నా తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment